‘బుగులోని’ జాతర వేలం పాట | - | Sakshi
Sakshi News home page

‘బుగులోని’ జాతర వేలం పాట

Nov 1 2026 4:43 AM | Updated on Nov 1 2026 4:43 AM

రేగొండ: బుగులోని జాతర వేలం పాటల ఆదాయం రూ.3.96 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈఓ బిల్లా శ్రీనివాస్‌, జాతర చైర్మన్‌ గంగుల రమణారెడ్డి తెలిపారు. ఈనెల 23నుంచి 27వరకు జరిగే బుగులోని జాతర వేలం పాటలు శనివారం ఆలయ ప్రాంగణంలో దేవావాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. లడ్డు, పులిహోర ప్రసాదాల విక్రయ హక్కు రూ.2.31 లక్షలు, కొబ్బరికాయలు, పూజా సామగ్రి విక్రయ హక్కు రూ.1.47 లక్షలు వచ్చినట్లు తెలిపారు. గతేడాదితో పోలిస్తే రూ.93వేలు అదనంగా ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సుదర్శన్‌, నాయకులు నిమ్మల విజేందర్‌, తిరుపతి, వెంకటస్వామి, గోపాల్‌, జాతర పురోహితుడు కుర్మచలం వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌, జయశంకర్‌

విగ్రహాలకు వినతి

భూపాలపల్లి అర్బన్‌: న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ.. ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె 19వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా శనివారం ఉద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హనుమాన్‌ దేవాలయం నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ మీదుగా జయశంకర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్‌, జయశంకర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మానవహారం చేపట్టి తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. డిమాండ్లు నెరవేరే వరకూ పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జిల్లా అధ్యక్షుడు బడితల రమేశ్‌, ప్రధాన కార్యదర్శి మధు, జేఏసీ నాయకులు డాక్టర్‌ రఘురాం, శ్రీనివాస్‌, ప్రభాకర్‌, ప్రవీణ్‌, డాక్టర్లు జగదీశ్‌, విజయ్‌, బాలకృష్ణ, రామూర్తి, రాజు, కృష్ణవేణి, పార్వతి, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సులు, ఫార్మసీ అధికారులు పాల్గొన్నారు.

ఏఐటీయూసీ

ఆవిర్భావ వేడుకలు

భూపాలపల్లి అర్బన్‌: ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుకలను శనివారం భూపాలపల్లి ఏరియాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కొమరయ్య భవన్‌తో పాటు కేటీకే 1, 2, 5, 6 గనులు, క్వాలిటీ విభాగం, వర్క్‌షాప్‌, ఏరియా ఆస్పత్రి, ఎస్‌అండ్‌పీసీ విభాగాల్లో నాయకులు జెండాలు ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమంల్లో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్‌, జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల రమేశ్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ కార్యదర్శి జి.సుధాకర్‌ రెడ్డి, సీపీఐ నాయకులు, వివిధ గనుల ఫిట్‌ కార్యదర్శులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

అష్ట తీర్థాల

ఘాట్‌ పనులు ప్రారంభం

కాళేశ్వరం: శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ సమీపంలోని త్రివేణి సంగమం వద్ద ఉన్న అష్ట తీర్థాల ఘాట్ల నిర్మాణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్ల నిధులు మంజూరు చేసి, టెండర్‌ ప్రక్రియ పూర్తి అనంతరం పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించింది. వీఐపీ ఘాటు సమీపం నుంచి అంతర్రాష్ట్ర వంతెన వరకు ఉన్న అష్ట తీర్థాల్లో ఎనిమిది తీర్థాల వద్ద భక్తుల సౌకర్యార్థం ఘాట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగనున్నాయి. ఘాట్ల నిర్మాణం, రోడ్డు పూర్తయితే పుష్కరాల సమయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలగనున్నాయి. సాధారణ ఘాట్‌ నుంచి అంతర్రాష్ట్ర వంతెన వరకు భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తికావాల్సి ఉంది. భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు అంగీకరించడం లేదని తెలుస్తోంది. మరోవైపు వీఐపీ ఘాట్‌ నుంచి సాధారణ ఘాట్‌ వరకు ఇప్పటికే రైతుల నుంచి భూములు సేకరించినప్పటికీ, వారికి పరిహారం చెల్లించాల్సి ఉంది. భూసేకరణ, పరిహారం అంశాలు పరిష్కారమైతే నిర్మాణ పనులు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని అధికారుల ద్వారా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement