భూపాలపల్లి: సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. ‘ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి’ అనే నినాదంతో శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ఎస్పీ పాల్గొని పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి టార్చ్ లైట్లు వెలిగిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు నకిలీ లింకులు, ఫేక్ కాల్స్, ఉద్యోగాల పేరుతో, పెట్టుబడులపై అధిక లాభాల ఆశ చూపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లు, వాట్సాప్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరికీ ఓటీపీ, పిన్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరాల నివారణ పోలీసులతో పాటు ప్రజలందరి బాధ్యత అన్నారు. కుటుంబ సభ్యులు, విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.
విజేతలకు ప్రశంస పత్రాల ప్రదానం
పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశంస పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, గంజాయి, మాదకద్రవ్యాలు, మహిళలు, బాలల భద్రత, రోడ్డు భద్రత వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల దృష్టికి వచ్చిన అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి విక్రయాలు, సైబర్ నేరాలకు సంబంధించిన సమాచారం ఉంటే నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, సీఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్సై శ్రీనివాస్, ఆర్‌ఎస్సై శివ కుమార్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


