ఆర్డీఓ కార్యాలయానికి స్థలం గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్డీఓ కార్యాలయానికి స్థలం గుర్తించాలి

Nov 1 2026 4:43 AM | Updated on Nov 1 2026 4:43 AM

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి నూతన ఆర్డీఓ కార్యాలయ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించి, భూసేకరణ ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం భూపాలపల్లి ఆర్డీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రెవెన్యూ విభాగాల పనితీరును సమీక్షించారు. జీఓ నంబర్‌ 59, 76 దరఖాస్తుల విచారణ, హైకోర్టు కేసులు, పట్టభద్రుల ఓటరు నమోదు, ఆర్‌అండ్‌ఆర్‌, గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూసేకరణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జీఓ 59 దరఖాస్తుల పరిశీలనకు మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారణ పూర్తి చేయాలని సూచించారు. హైకోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని, ప్రజల రెవెన్యూ సమస్యలను నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్‌ లక్ష్మిరాజయ్య, ఈడీఎం శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

ఫైనల్‌ ఎంబీబీఎస్‌ పరీక్షల్లో 99శాతం ఉత్తీర్ణత

ఫైనల్‌ ఎంబీబీఎస్‌ పార్ట్‌–1 పరీక్షా ఫలితాల్లో జిల్లా వైద్య కళాశాల విద్యార్థులు 99 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటడం పట్ల కలెక్టర్‌ రాహుల్‌ శర్మ హర్షం వ్యక్తంచేశారు. మొత్తం 94మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 93మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఒకరు డిస్టింక్షన్‌, 39మంది ప్రథమ శ్రేణి, 53మంది సాధారణ ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు కష్టపడి చదివి అద్భుత ఫలితాలు సాధించడం అభినందనీయమని కలెక్టర్‌ పేర్కొన్నారు.

ప్రణాళికలు 15లోగా సిద్ధం చేయాలి

గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి తాత్కాలిక పనుల ప్రణాళికలు, అంచనాలను ఈనెల 15లోగా సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్‌ ఆదేశించారు. శనివారం ఎనిమిది జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఏర్పాట్లను సమీక్షించారు. బాసర, కోటిలింగాల, మంథని, కాళేశ్వరం, భద్రాచలం తదితర పుణ్యక్షేత్రాల్లో ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు, భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని, తాత్కాలిక పనుల టెండర్లను వేగవంతం చేయాలని సూచించారు. పనుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement