● సీనియర్ సివిల్ జడ్జి తాడూరు మహతి వైష్ణవి
మల్హర్(కాటారం): దేశ బంగారు భవిష్యత్ నేటి బాలల పరిరక్షణతోనే సాధ్యమవుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి తాడూరు మహతి వైష్ణవి అన్నారు. ‘సురక్షిత్ బచ్‌పన్ అభియాన్’ ప్రచారంలో భాగంగా శనివారం కాటారంలోని ప్రభుత్వ పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జి తాడూరు మహతి వైష్ణవి మాట్లాడుతూ...విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోక్సో నేరాల నివారణతో పాటు సైబర్ మోసాల నుంచి పిల్లలను కాపాడుకోవడం మనందరి ప్రథమ కర్తవ్యమని చెప్పారు.
బాల్యం మనందరి బాధ్యత
కాటారంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.అఖిల మాట్లాడారు. ప్రతీ బిడ్డ బాల్యం సమాజంలోని మనందరి బాధ్యత అని చెప్పారు. చఈ అవగాహన కార్యక్రమాల్లో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకటస్వామి, సూపరింటెండెంట్ రఘురాం, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది దేవేందర్, గోపాల్ పాల్గొన్నారు.


