● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్ కుమార్
భూపాలపల్లి అర్బన్: జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపిక, సహనంతో ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె.జీవన్‌కుమార్ విద్యార్థులకు సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జంగేడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్యవివాహాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పాఠశాల స్థాయి నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జీవితంలో ఆదర్శనీయులను అనుసరిస్తూ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి తాడూరు మహతి వైష్ణవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్‌కుమార్ నాయక్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి అఖిల, సీఐ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి, పాఠశాల ప్రిన్సిపాల్ ఈశ్వరి, ఉపాధ్యాయులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.


