భూపాలపల్లి: జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బకాయిల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైస్ మిల్లర్లు సేకరించిన ధాన్యానికి తగినట్లుగా బియ్యాన్ని ప్రభుత్వానికి సకాలంలో అప్పగించాల్సి ఉండగా.. కొందరు మిల్లర్లు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వేల టన్నుల బియ్యాన్ని వెనక్కి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. తాజాగా వెలువడిన అధికారిక నివేదికలు జిల్లాలోని రైస్ మిల్లర్ల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి.
రూ.155.8కోట్ల విలువైన బియ్యం ఏమైనట్లు..
సివిల్ సర్వీస్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం 2025–2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,17,106.520 మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లర్లకు కేటాయించారు. నిబంధనల ప్రకారం మిల్లర్లు 67 శాతం చొప్పున ప్రభుత్వానికి 78,461.368 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 34,768.675 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే డెలివరీ చేయగా, ఇంకా అక్షరాలా 43,699.415 మెట్రిక్ టన్నుల(రూ. 155.8 కోట్ల విలువ) బియ్యం బకాయి ఉండటం గమనార్హం. సుమారుగా 55శాతానికి పైగా సీఎంఆర్ ప్రభుత్వానికి అందాల్సి ఉంది.
బాయిల్డ్, రా రైస్ మిల్లర్ల డొల్లతనం..
జిల్లాలో బాయిల్డ్, రా రైస్ మిల్లుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. బాయిల్డ్ మిల్లులకు మొత్తం 44,044.120 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా, రావాల్సిన 29,509.560 మెట్రిక్ టన్నుల బియ్యంలో ఇప్పటివరకు 14,439.341 మెట్రిక్ టన్నులు మాత్రమే డెలివరీ చేశారు. ఇంకా 15,076.941 మెట్రిక్ టన్నుల బకాయి ఉంది. రా రైస్ మిల్లుల యజమానుల పరిస్థితి కూడా అలాగే ఉంది. మొత్తం 73,062.400 మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి గాను, రావాల్సిన 48,951.808 మెట్రిక్ టన్నుల బియ్యంలో కేవలం 20,329.334 టన్నులు మాత్రమే అందాయి. మిల్లర్లు ఇంకా భారీఎత్తున 28,622.474 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది.
చర్యలు శూన్యం..
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తుంటే, కొందరు మిల్లర్లు ఆ ధాన్యాన్ని ఇతర మార్కెట్లలో అమ్ముకుంటూ కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సకాలంలో సీఎంఆర్ అప్పగించని మిల్లులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పౌర సరఫరాలశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
సర్కారుకు భారీగా టోకరా వేస్తున్న
రైస్‌మిల్లర్లు
ఇంకా పూర్తికాని గతేడాది
బియ్యం అప్పగింత
రూ.155కోట్ల విలువైన బియ్యం
రైస్‌మిల్లర్ల వద్దే..
జంకని మిల్లర్లు..
సీఎంఆర్ అప్పగించని రైస్‌మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తొలుత సివిల్ సప్లై అధికారులతో దాడులు చేయించి కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ మిల్లర్లు జంకకపోవడంతో సీఐడీకి బాధ్యతలు అప్పగించింది. సీఐడీ అధికారులు ఇటీవలనే పక్క జిల్లా ములుగులో పలువురు రైస్‌మిల్లర్లను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ జిల్లాలోని మిల్లర్లు సీఎంఆర్ అప్పగించడంలో అలసత్వం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా కొందరు రైస్‌మిల్లర్లు సన్నబియ్యానికి బదులుగా దొడ్డుబియ్యం అప్పగించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.


