కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం బాలాలయంలో శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. నాలుగు నెలల 18 రోజులకు సంబంధించిన హుండీలో భక్తులు కానుకలు సమర్పించగా నగదును లెక్కించగా రూ.16,60,214 ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేశ్ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమం పర్యవేక్షణాధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్‌శర్మ, ధర్మకర్తలు పద్మ, అశోక్, సత్యం, సీతారాం, దుర్గయ్య, సీనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ సిబ్బంది శ్రీ వల్లి సేవా స్వచ్ఛంద సమితి సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
యువతకు ఉచిత శిక్షణ
భూపాలపల్లి అర్బన్: డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్ నగేష్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇన్ఫోసిస్ సహకారంతో లెర్నెట్ స్కిల్స్, టాస్క్ సంయుక్తంగా నిర్వహించే శిక్షణ తరగతులు నవంబర్ 5నుంచి భూపాలపల్లిలోని టాస్క్ కేంద్రంలో ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. 18నుంచి 28 ఏళ్లలోపు డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. రోజుకు 4నుంచి 5గంటల చొప్పున మొత్తం 90 గంటల పాటు శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. శిక్షణ సమయంలో అవసరమైన మెటీరియల్ ఉచితంగా అందించడంతో పాటు, శిక్షణ పూర్తిచేసిన వారికి ఇన్ఫోసిస్ సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు 80740 31962 నంబర్‌కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
జిల్లాస్థాయి క్రీడాపోటీల ముగింపు
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. జిల్లాలోని 8 పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన సుమారు 350మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. అండర్–17 కబడ్డీ బాలబాలికల జట్లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. నవంబర్ 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించనున్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేసి అభినందించారు. ముగింపు కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ సెక్రటరీ జైపాల్, వివిధ పాఠశాలల పీడీలు, పీఈటీలు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఎమ్మెల్యేకు ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది వినతి
భూపాలపల్లి అర్బన్: 18 రోజులుగా సమ్మె చేస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, ఎన్నో ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు బడితల రమేశ్, ప్రధాన కార్యదర్శి మధు, ఉపాధ్యక్షుడు డాక్టర్ రఘురాం, జేఏసీ నాయకులు శ్రీనివాస్, ప్రభాకర్, ప్రవీణ్, డాక్టర్లు జగదీశ్, విజయ్, బాలకృష్ణ, రాముర్తి, రాజు, కృష్ణవేణి, పార్వతి, స్టాఫ్ నర్సులు, ఫార్మసీ అధికారులు పాల్గొన్నారు.


