● భూమి నాణ్యత పరిశీలనకు
సింగరేణి శ్రీకారం
● 350నుంచి 1000 మీటర్ల లోతు
వరకు తవ్వకాలు
● పూర్తి కావడానికి నెల రోజులు
మల్హర్: తాడిచర్ల–2 ఓపెన్‌కాస్ట్ ఏర్పాటు నేపథ్యంలో మండల కేంద్రం తాడిచర్ల పరిధిలోని తాడిచర్ల–పెద్దతూండ్ల శివారు ప్రాంతంలో ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఏర్పాటు దిశగా సింగరేణి సంస్థ శరవేగంగా అడుగులు వేస్తోంది. ఓపెన్ కాస్ట్ గని ఏర్పాటులో భాగంగా ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతమైన డ్రిల్లింగ్ పనులను చేపడుతున్నారు.
మట్టి డంపింగ్‌కు భూమి నాణ్యత పరీక్ష..
గని తవ్వకాల సమయంలో భారీ స్థాయిలో వెలువడే ఓవర్ బర్డెన్ (ఓబీ మట్టి, రాతి వ్యర్థాలు) సురక్షితంగా డంప్ చేయడానికి వీలుగా ఆయా ప్రాంతాల్లోని భూమి నాణ్యత, స్వభావాన్ని, భూగర్భ పొరల ధృఢత్వాన్ని పరీక్షించడమే ఈ డ్రిల్లింగ్ ప్రధాన ఉద్దేశమని సింగరేణి అధికారులు స్పష్టం చేశారు.
మూడు చోట్ల డ్రిల్లింగ్..
ఈ ప్రాజెక్ట్ పరిధిలోని మూడు వేర్వేరు కీలక ప్రాంతాల్లో డ్రిల్లింగ్ నిర్వహించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. భూగర్భంలో ఉన్న పరిస్థితులను నిశితంగా అధ్యయనం చేసేందుకు అవసరం మేరకు 350మీటర్ల నుంచి ఏకంగా 1000 మీటర్ల లోతు వరకు ప్రొఫెషనల్ డ్రిల్లింగ్ వేస్తున్నట్లు తెలిపారు. నిర్ణయించిన మూడు పాయింట్లలో ఇప్పటికే ఒక చోట డ్రిల్లింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రెండో చోట పనుల శరవేగంగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. సాంకేతిక కారణాలు, భూగర్భ లోతు ప్రాతిపదికన ఒక్కో పాయింట్ వద్ద డ్రిల్లింగ్ పూర్తికావడానికి దాదాపు 30రోజుల నుంచి 40 రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. తాడిచర్ల–2 కోల్ బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల సింగరేణి సంస్థకు కేటాయించింది. దాదాపు 182 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏటా ఆరు మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అంచనా. 40ఏళ్ల నుంచి 50ఏళ్ల పాటు సుదీర్ఘకాలం నడిచే ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక ప్రాంత అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలకు పెద్దపీట పడనుండటంతో తాడిచర్ల–2 పనులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


