భూపాలపల్లి అర్బన్: జిల్లాస్థాయి జానపద నృత్య పోటీలు శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.లలిత ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలు, సామాజిక స్పహ పెంపొందించడంతో పాటు జానపద కళలు, సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించడమే పోటీల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, లింగ సమానత్వం, పారిశుద్ధ్యం, బాధ్యతాయుత పౌరసత్వం, వ్యక్తుల మధ్య సంబంధాలు, హింస నుంచి రక్షణ, డిజిటల్ పరికరాల సురక్షిత వినియోగం తదితర పది అంశాలపై విద్యార్థులు జానపద నత్యాల ద్వారా చక్కటి సందేశాలిచ్చారు. ఈ పోటీల్లో చిట్యాల మండలం ప్రథమ బహుమతి సాధించగా, గణపురం, భూపాలపల్లి మండలాలు ద్వితీయ బహుమతులు పొందాయి. విజేతలకు డీఈఓ లలిత, సీఎంఓ సామల రమేశ్, మండల విద్యాశాఖ అధికారులు దేవా, అఫ్రోజ్, ప్రధానోపాధ్యాయురాలు ఎన్.లక్ష్మీప్రసన్న బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, న్యాయనిర్ణేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.


