భూపాలపల్లి అర్బన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే వేళ అన్నదాతను అకాల వర్షాల భయం వెంటాడుతోంది. అక్టోబర్ నెలాఖరులో వాతావరణం ఒక్కసారిగా మారడం, ఆకాశం మేఘావృతం కావడం, చిరుజల్లులు కురుస్తుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో వరి కోతలకు సిద్ధమవుతున్న రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సాగు పెట్టుబడులు, కూలీల కొరతతో సతమతమవుతున్న రైతులకు అకాల వర్షాల ముప్పు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. పత్తి ఏరుతుండగా, వరి పంట కోసి ధాన్యాన్ని సురక్షితంగా ఇంటికి చేర్చే వరకు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
ఏటా ఇదే ఆందోళన..
వరి సాగులో విత్తనం వేసినప్పటి నుంచి ధాన్యం విక్రయించే వరకు రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడం, కూలీల కొరత, సాగు ఖర్చులు అధికం కావడంతో పెట్టుబడుల భారం పెరుగుతోంది. ఈ క్రమంలో పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కురిస్తే రైతుల శ్రమంతా వృథా అయ్యే ప్రమాదం ఉంది. వరి కోతల సమయంలో వర్షం పడితే పంట నేలవాలడంతోపాటు కోసిన ధాన్యం తడిసిపోయే అవకాశముంది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడం, నాణ్యతను కాపాడటం, కొనుగోలు కేంద్రాలకు తరలించడం రైతులకు అదనపు భారంగా మారుతుంది.
వాతావరణంలో మార్పులతో అయోమయం
వాతావరణంలో మార్పులు రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయి. కోతలు ప్రారంభిస్తే వర్షం అడ్డుపడుతుందేమోనని, ఆలస్యం చేస్తే పంట దెబ్బతింటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. కోసిన పంటను పొలాల్లో ఉంచలేక, ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునే సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, ఇతర రక్షణ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా గురువారం 42.2 మి.మీ వర్షపాతం నమోదు కాగా సగటున 3.8 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలో అత్యధికంగా పలిమెల మండలంలో 9.2 మి.మీ వర్షపాతం నమోదవగా మల్హర్, టేకుమట్ల మండలాల్లో వర్షం కురవలేదు.
పత్తి, మిర్చి పంటలపై సైతం ప్రభావం
అకాల వర్షాలు కురవడం వలన ప్రధానంగా వరి పంటతో పత్తి, మిర్చి పంటలపైన సైతం తీవ్ర ప్రభావం చూపే అకాశాలు ఉన్నాయి. పత్తి పంట ఏరడానికి సిద్ధంగా ఉంది. పత్తి తడిసి, కాయలు రంగు మారి నాణ్యత కోల్పోతున్నాయి. దీంతో దిగుబడి తగ్గడమే కాకుండా మార్కెట్ ధరపై ప్రభావం పడే అవకాశం ఉంది. మిరప పంటలో నీరు నిలిస్తే వేర్లు కుళ్లి, తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది.
గురువారం వర్షపాతం వివరాలు (మి.మీ)
మల్హర్, టేకుమట్లలో వర్షం కురవలేదు
కోతకొచ్చిన వరి..
పొంచిఉన్న వాన ముప్పు
మేఘావృతమైన వాతావరణంతో
రైతుల్లో ఆందోళన
నెలల తరబడి శ్రమకు ప్రకృతి పరీక్ష
9.2
5.8
5.4
4.6
4.2
3.8
3.6
3.2
2.4
పలిమెల
కాటారం
మహదేవపూర్
భూపాలపల్లి
మహాముత్తారం
రేగొండ
చిట్యాల
మొగుళ్లపల్లి
గణపురం


