నేడు మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

భూపాలపల్లి: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు నేడు (శుక్రవారం) జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంపై ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై కచ్చితమైన సమాచారంతో నివేదికలు సిద్ధం చేసుకొని సమీక్ష సమావేశానికి హాజరు కావాలని కలెక్టర్‌ ఆదేశించారు. గతేడాది, ప్రస్తుత ఏడాది ఎల్‌నినో ప్రభావానికి సంబంధించిన వివరాలతో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ (పీపీటీ) సిద్ధం చేసి సమర్పించాలని స్పష్టం చేశారు.

జీఓ 25ను సవరించాలి

మల్హర్‌ (కాటారం): ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు అనే అశాసీ్త్రయ హేతుబద్ధీకరణ ఉత్తర్వులు జీఓ 25ను వెంటనే సవరించాలని తెలంగాణ ప్రొగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం కాటారం, దేవరాపల్లి, ధన్వాడ, గంగారం పాఠశాలల్లో టీపీటీఎఫ్‌ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు. ఐదు తరగతులకు ఇద్దరు టీచర్లతో బోధన సాగితే విద్యా నాణ్యత దెబ్బతింటుందన్నారు. ప్రతీ తరగతికి ఒక టీచర్‌ను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బానోతు సేవానాయక్‌, ప్రధాన కార్యదర్శి గువ్వాడి జగపతిరావు, ఉపాధ్యక్షుడు గండు రాజబాబు, మండల అధ్యక్షుడు బొల్లం సతీష్‌, శ్రీకాంత్‌, నాయకులు పాల్గొన్నారు.

‘జలసిరి’ పనులు

వేగవంతం చేయాలి

చిట్యాల: మండలంలోని వివిధ గ్రామాలలో జరుగుతున్న వీబీజీ రామ్‌ జీ జలసిరి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని డీఆర్‌డీఓ బాలకృష్ణ అన్నారు. గురువారం జూకల్‌ గ్రామంలోని రైతుల వ్యవసాయ క్షేత్రంలో తవ్విన పంట కుంటలు, కమ్యూనిటీ సోక్‌పిట్స్‌ పనులను పరిశీలించారు. పంట కుంటలతో కలిగే లాభాలు, నీటి నిల్వ సామర్ధ్యం గురించి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ హలీమ్‌పాషా, ఈసీ సుధాకర్‌, స్రవంతి, సిబ్బంది చిరంజీవి, నవీన్‌, మారి స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులు, ఐకేపీ సీసీలు పాల్గొన్నారు.

జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో రజత పతకం

కాళేశ్వరం: హర్యానాలో నిర్వహించిన జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో తెలంగాణ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. ఈ పోటీల్లో మహదేవపూర్‌ మండలం సూరారం గ్రామానికి చెందిన ములకల్ల సూర్యచరణ్‌, రిష్మిత్‌ ప్రతిభ కనబరిచి విజయంలో కీలక పాత్ర పోషించారు. తమ కుమారులు ములకల్ల సూర్యచరణ్‌, రిష్మిత్‌ జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

కొనసాగుతున్న సమ్మె

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె గురువారం 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పుట్ట మహేందర్‌ సమ్మెకు హాజరై డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ రక్షణ సేన నాయకుడు డాక్టర్‌ నలమాస శ్రీకాంత్‌ గౌడ్‌ సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు బడితల రమేశ్‌, ప్రధాన కార్యదర్శి మధు, ఇతర నాయకులు, వైద్య సిబ్బంది, స్టాఫ్‌ నర్సులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement