● రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
వెంకటాపురం(ఎం): గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని విధాలా కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి గురువారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చైర్మన్ శ్రీనివాస్‌తో పాటు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలకేంద్రంలో రూ. 99లక్షల అంచనా వ్యయంతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గతంలో కాలనీలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులను మంజూరు చేసినట్లు తెలిపారు. స్థానిక సర్పంచ్, నాయకుల సూచనలు, సలహాలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆశించిన మేర వర్షాలు కురవని నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు. గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి వెల్లడించారు.
విద్యార్థులు ఆసక్తిగా చదవాలి
గోవిందరావుపేట: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది విద్యేనని, విద్యార్థులు ఆసక్తితో చదివి ఉన్నతంగా ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని పస్రా జెడ్పీహెచ్‌ఎస్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సురక్షిత్ బచ్‌పన్ అభియాన్‌లో భాగంగా గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్య జీవితంలోని ప్రతి దశలో అండగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటూ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలన్నారు. పాఠశాలల్లో, ప్రయాణాల్లో, ఇళ్ల వద్ద ఎదురయ్యే వేధింపులను గుర్తించేలా వ్యక్తగత భద్రతపై అవగాహన పెంచుకోవాలన్నారు.


