‘ఉపాధి’ కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ కార్యాచరణ

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

భూపాలపల్లి రూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయపరంగా ఈ సారి ఆశించిన స్థాయిలో పనులు ఉండే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది ఉపాధి పనులకు భారీగా డిమాండ్‌ ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను అధిగమించడంతో పాటు కూలీల డిమాండ్‌ మేరకు పనులు కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ దృష్టి సారించింది. వీబీజీ రాంజీ పథకంలో వికసిత్‌ భారత్‌–2047 లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధి సాధించే దిశగా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం గ్రామాల వారీగా సభలు నిర్వహించి గుర్తించిన పనులకు అక్టోబర్‌ 2న ఆమోదముద్ర వేశారు.

గ్రామాల వారీగా పనుల గుర్తింపు

అక్టోబర్‌ 2 నుంచి 2027 జూన్‌ 30వరకు వీబీజీ రాంజీ పథకం కింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన కార్యాచరణను రూపొందించారు. ఆయా గ్రామాల్లో ప్రజల వాస్తవ అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులు, మౌలిక వసతుల లోటుపాట్లను అధిగమించేలా గ్రామసభలో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇటీవల జిల్లాలోని ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీబీజీ రాంజీ పథకం కింద మొత్తం 375 పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ పనులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇందులో నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధికి మౌలిక వసతుల కల్పన, విపత్తుల నివారణ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

పలు శాఖల భాగస్వామ్యం

ఉపాధి హామీ పనులను సాధారణంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహించేది. ఇటీవల వీబీజీ రాంజీగా పేరు మార్చిన కేంద్రం ప్రస్తుతం 26 శాఖలను ఇందులో భాగస్వాములను చేసింది. కూలీలకు ఉపాధితో పాటు ఆయా శాఖల్లో నిర్మాణాత్మకమైన పనులు చేపట్టే దిశగా చర్యలు చేపట్టింది. ప్రధానంగా పంచాయతీరాజ్‌, అటవీ, సెర్ప్‌, వ్యవసాయం, విద్య, మత్స్య, ఉద్యాన, రెడ్కో, డెయిరీ, గృహ నిర్మాణం, సెరికల్చర్‌, ఎస్‌బీఎం వంటి శాఖలను అనుసంధానం చేస్తూ పనులను కల్పించనున్నారు

నీటి సంరక్షణకు ప్రాధాన్యం

ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదైన దృష్ట్యా ప్రభుత్వం జలసిరి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది. దీంతో ఉపాధి హమీ పథకం ద్వారా జిల్లాలో నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా నీటి గుంతల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో కూలీలకు ఉపాధి లభించడంతో పాటు భూగర్భ జలాల పెంపు సాధ్యమవుతోంది.

– బాలకృష్ణ, డీఆర్‌డీఓ

ఎల్‌నినోను ఎదుర్కొనేలా రూపకల్పన

జిల్లాలో ప్రతీ పంచాయతీలో

పనుల గుర్తింపు

26 ప్రభుత్వ శాఖల భాగస్వామ్యం

నీటి సంరక్షణకు చర్యలు

కూలీలకు ఉపాధి..

ప్రస్తుతం వ్యవసాయ పనులు లేనందున కూలీలకు వీబీజీ రాంజీ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. గతంలో జాబ్‌కార్డులు కలిగిన కుటుంబాలకు గరిష్టంగా 100 పనిదినాలు కల్పించగా, ప్రస్తుతం 125కు పెంచారు. పని కోరిన కూలీలకు 15రోజుల్లో సైతం కొత్తకార్డులు మంజూరు చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వన మహోత్సవ కార్యక్రమం ఆలస్యంకాగా ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, జలసిరి పనులు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement