డీఈఓ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

డీఈఓ తనిఖీ

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను జిల్లా ఇన్‌చార్జ్‌ విద్యాశాఖ అధికారి లలిత మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూపాలపల్లి మండలం కమలాపూర్‌ మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, టేకుమట్ల కేజీబీవీలను తనిఖీ చేశారు. కమలాపూర్‌ పాఠశాలల్లో విద్యార్థుల విషయాలవారీ అభ్యసన సామర్థ్యాలను పరీక్షించి, తరగతి హాజరు, మధ్యాహ్న భోజనం నిర్వహణను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఉన్నత పాఠశాలలో ఐఎఫ్‌పీ ప్యానల్‌ బోర్డులను వినియోగిస్తూ నాణ్యమైన విద్యాబోధన అందించాలని, ఉపాధ్యాయులు సెలవు తీసుకునే ముందు తప్పనిసరిగా అనుమతి పొందాలని ఆదేశించారు. అనంతరం టేకుమట్ల కేజీబీవీని తనిఖీ చేసిన డీఈఓ తరగతి గదుల నిర్వహణ, ఉపాధ్యాయుల బోధనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో కమ్యూనిటీ మొబైల్‌ అధికారి సామల రమేశ్‌, ప్రధానోపాధ్యాయులు విష్ణుమూర్తి, గణపతి, జీసీడీఓ శైలజ, స్పెషల్‌ ఆఫీసర్‌ స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గంజాయి పరీక్షల్లో

నలుగురికి పాజిటివ్‌

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన గంజాయి పరీక్షల్లో నలుగురు యువకులకు పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. పట్టణంలో అనుమానిత గంజాయి వినియోగదారులపై సీసీఎస్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. సీసీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్‌ నిర్వహించారు.

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌లో

అర్చితకు రజతం

టేకుమట్ల: టేకుమట్ల మండలకేంద్రంలోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాలకు చెందిన పోశాల అర్చిత బాక్సింగ్‌లో రాష్ట్రస్థాయిలో రజత పథకాన్ని సాధించినట్లు జిల్లా యువజన క్రీడల అధికారి చిర్ర రఘు, పీడీ చాగంటి ఆనంద్‌ మంగళవారం తెలిపారు. స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26న హైదరాబాద్‌ బోడుప్పల్‌లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచింది. అర్చితను మండల విద్యాధికారి చిదిరాల సుధాకర్‌, ఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి జయపాల్‌, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

బాలల పరిరక్షణే భవిష్యత్‌

గణపురం: దేశ బంగారు భవిష్యత్‌ నేటి బాలల పరిరక్షణతోనే సాధ్యమవుతుందని సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి తాడూరు మహతి వైష్ణవి అన్నారు. సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌ ,బాలల పరిరక్షణపై మంగళవారం గణపురం మండలం గాంధీనగర్‌ మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహతి వైష్ణవి మాట్లాడుతూ పోక్సో నేరాల నివారణ, సైబర్‌ మోసాల నుంచి పిల్లలను కాపాడుకోవడం ప్రథమ కర్తవ్యం అన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి అవగాహన కలిగి ఉండాలన్నారు. మండలంలోని చెల్పూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.అఖిల హాజరై మాట్లాడారు. ప్రతీ బిడ్డ బాల్యం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ వెంకటస్వామి, సూపరింటెండెంట్‌ రఘురాం, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్‌, గోపాల్‌, రాజ్‌కుమార్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement