హద్దులు ఏర్పాటు చేస్తలేరు..
నా పేరు ఇండ్ల రాజేందర్. మాది టేకుమట్ల గ్రామం. నాకు చిట్యాల మండలం నవాబుపేట శివారు సర్వే నంబర్ 240లో 1.10 ఎకరాల భూమి ఉంది. హద్దుల విషయంలో పక్కనున్న భూమి వాళ్లతో వివాదం ఉంది. భూమి కొలతలు చేసి ఎవరి హద్దులు వారికి చూపించాలని, తహసీల్దార్, ఆర్డీఓలకు పలుమార్లు కలిసి వినతి పత్రాలు సమర్పించాను. అయినా ఇప్పటి వరకు ఒక్కరు కూడా భూమి దగ్గరకు రాలేదు. ఎవరిని కలిసినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. దీంతో ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చా.
– ఇండ్ల రాజేందర్, రైతు, టేకుమట్ల
మూసివేసిన పాఠశాలను తెరిపించాలి..
మహాముత్తారం మండలం ప్రేమ్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్‌పై మరోచోటికి పంపించారు. దీంతో ఈ సంవత్సరం పాఠశాల మూతపడింది. ప్రేమ్‌నగర్ ప్రాంతానికి చెందిన గిరిజన కమ్యూనిటీకి చెందిన పేద విద్యార్థులు ప్రభుత్వ విద్యకు దూరమయ్యారు. బడిలో ఉండాల్సిన పిల్లలు పొలం, కూలీ పనులకు వెళ్తున్నారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వెంటనే పాఠశాలను పునః ప్రారంభించాలి.
– పీక కిరణ్ మౌర్య
● ప్రజావాణికి వినతుల వెల్లువ
● అధికంగా భూసమస్యలపైనే..
భూపాలపల్లి: కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి వినతులు వస్తూనే ఉన్నాయి. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 70 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఎక్కువగా పింఛన్‌ల మంజూరు, భూములకు పట్టాలు, ఇతర భూ సమస్యలే ఉన్నాయి. దరఖాస్తులను కలెక్టర్ రాహుల్ శర్మ స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించవద్దని, తీసుకున్న చర్యలు, పరిష్కార స్వభావాన్ని ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ గ్రీవెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పట్టా భూమి అసైన్డ్‌గా చూపిస్తుంది..
గణపురం మండలం శివారులో 2003 సర్వేనంబర్‌లో ఎకరం 32 గుంటల భూమి మా ముత్తాతల నుంచి పట్టాగా ఉంది. మేము సాగు చేసుకుంటూనే ఉన్నాము. ఈ మధ్యల అదే భూమి అసైన్డ్ భూమిగా చూపెడుతుంది. అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా.. మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆ భూమిని పట్టాకు ఎక్కించగలరని కోరుకున్నా.
– డ్యాగల భిక్షపతి, తిమ్మాపురం


