భూపాలపల్లి: మహారాష్ట్ర సిరొంచ సమీపం రామంజాపూర్ వద్ద మూడేళ్ల క్రితం మూతబడ్డ పేకాట క్లబ్‌లు 15 రోజుల క్రితం తెరుచుకున్నాయి. కాళేశ్వరం నుంచి సుమారు 8 కిలోమీటర్ల మాత్రమే కావడంతో జిల్లాలోని పేకాటరాయుళ్లతో పాటు గోదావరి సరిహద్దు జిల్లాలైన కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లితో పాటు గోదావరిఖని పట్టణాలవాసులు ఎక్కువగా పేకాట ఆడేందుకు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. దీంతో పలు కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
ఒక గేమ్ రూ.5వేల నుంచి రూ.10వేలు..
పేకాటపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పోలీసులు నిఘా పెంచి, దాడులు నిర్వహిస్తూ పేకాట ఆడిన వారిని పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఆడటం ఇబ్బందికరంగా మారింది. విషయాన్ని గమనించిన కొందరు తెలంగాణవాసులు మహారాష్ట్ర సిరొంచ సమీపం రామంజాపూర్ వద్ద రెండు పేకాట క్లబ్‌లను నెలకొల్పారు. ఈ క్లబ్‌లలో రూ.5వేల నుంచి రూ.10వేల వరకు టేబుళ్లు ఉంటాయి. ఒక్కో టేబుల్‌కు 9 మంది చొప్పున కూర్చొని కెస్నా, తీన్ పత్తి, రమ్మీ, కట్ పత్తా ఆడుతారు. రూ.5వేల టేబుల్‌లో 9 మంది కూర్చొని ఆడితే మొత్తం రూ.45వేలు కాగా, గెలిచిన వ్యక్తికి రూ.40వేలు ఇచ్చి మిగిలిన రూ.5వేలను క్లబ్ నిర్వాహకుడు తీసుకుంటాడు. ఇలా రూ.10వేల గేమ్ అయితే నిర్వాహకుడు రూ.10వేలను తీసుకుంటాడు. ఈ లెక్కన క్లబ్ నిర్వాహకుడికి రోజుకు ఆదాయం సుమారు రూ.20 లక్షల వరకు వస్తుందని తెలుస్తోంది.
స్పోర్ట్స్ క్లబ్‌ల పేరిట పేకాట..
స్పోర్ట్స్ క్లబ్బుల్లో డబ్బులు పెట్టి ఆడే ఏ ఆటలైనా గ్యాంబ్లింగ్ చట్టం ప్రకారం నిషేధం. మహారాష్ట్రలోని క్లబ్బుల్లో సభ్యత్వం ఉన్న వారికి రిక్రియేషన్ పొందేలా షరతులతో కూడిన రమ్మీ ఆడుకునే వెసులుబాటు ఉంటుంది. డబ్బులు మాత్రం పెట్టి గ్యాంబ్లింగ్ ఆడరాదు. అయినప్పటికీ ఆ రాష్ట్రంలోని స్థానిక పోలీసులను మేనేజ్ చేసుకుంటూ పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారు.
సిరొంచ సమీపంలో వెలసిన
పేకాట క్లబ్‌లు
ఆట కోసం వెళ్తున్న
జిల్లా పేకాటరాయుళ్లు
జేబులు గుల్ల కావడంతో
ఆర్థిక ఇబ్బందులు
ఆకట్టుకునేందుకు ఆఫర్లు..
క్లబ్ నిర్వాహకులు పేకాటరాయుళ్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. ఉచితంగా భోజనం, టీ, టిఫిన్లు అందించడమే కాక వాహన అద్దె కూడా చెల్లిస్తున్నారు. క్లబ్‌లో మెస్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం టీ, కాఫీ, టిఫిన్లు అందిస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి కూరగాయలు, కోడిగుడ్డు, చికెన్‌తో భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. కావాల్సినవన్నీ ఉచితంగానే సరఫరా చేస్తున్నారు. ఆట పూర్తయిన తరువాత ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎన్ని ఆటలు ఆడారో.. వివరాలు తీసుకొని వాహన అద్దె కూడా చెల్లిస్తున్నారు.


