బుగులోని జాతర ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

బుగులోని జాతర ఘనంగా నిర్వహించాలి

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

భూపాలపల్లి: రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి బుగులోని జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. సోమవారం భూపాలపల్లి ఐడీఓసీ సమావేశ మందిరంలో కలెక్టర్‌ రాహుల్‌ శర్మతో కలిసి దేవాదాయ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, వైద్య, రవాణా, పోలీస్‌, అగ్నిమాపక, అటవీశాఖల అధికారులతో జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నవంబర్‌ 23 నుంచి 27 వరకు నిర్వహించనున్న జాతర మహోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. గతంలో మంజూరైన కోనేరు బావి, శాశ్వత కల్యాణ మండపం నిర్మాణం, విద్యుత్‌ లైట్లు, పైప్‌లైన్‌, మెట్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రూ.8.75 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రహదారి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. జాతరకు వచ్చే రహదారులను మరమ్మతు చేసి భక్తుల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దాలన్నారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నిరంతర తాగునీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బోర్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ పథకాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ, బ్లీచింగ్‌ పౌడర్‌ పిచికారీ వంటి పనులను ముందస్తుగానే చేపట్టాలని తెలిపారు. జాతర సమయంలో విద్యుత్‌ అంతరాయం లేకుండా అవసరమైన విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్‌ సరఫరా అందించాలన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్‌, అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, దేవాలయ ఈఓ శ్రీనివాస్‌, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వాల్మీకి రచనలు స్ఫూర్తిదాయకం..

మహర్షి వాల్మీకి జీవితం, ఆయన రచనలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, జ్ఞానం, కృషి, మంచి ఆలోచనలతోనే మనిషి జీవితంలో గొప్ప మార్పు సాధ్యమవుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్‌ రాహుల్‌ శర్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి ప్రాచీన భారతీయ సంస్కృతి, సాహిత్యానికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఇందిర, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వాల్మీకి బోయ జిల్లా అధ్యక్షులు దీశెట్టి గోపాల్‌, పట్టణ అధ్యక్షుడు మేకల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు ఇబ్బంది రానివ్వొద్దు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement