భూపాలపల్లి అర్బన్: సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్‌టీయూసీ) భూపాలపల్లి ఏరియా బ్రాంచ్ ఉపాధ్యక్ష పదవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత ఉపాధ్యక్షుడి రెండేళ్ల పదవీకాలం ఈ నెల 6వ తేదీతో ముగియడంతో.. తదుపరి పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్న దానిపై యూనియన్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో ఈ పదవి కోసం పోటీ మరింత ప్రాధాన్యం సంతరించుకున్నట్లు తెలుస్తోంది.
ముందుగానే కసరత్తు..
బ్రాంచ్ ఉపాధ్యక్ష పదవి ఖాళీ అవుతుందన్న సంకేతాలతో రెండు నెలల నుంచే పలువురు నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. కేంద్ర కమిటీ నాయకులతో పాటు జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులతోనూ సంప్రదింపులు జరుపుతూ తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు యూనియన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. తుది నిర్ణయం కేంద్ర కమిటీ తీసుకునే అవకాశాలున్నాయి.
నలుగురి పేర్లు..
ప్రస్తుతం ఉపాధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో జోగ బుచ్చయ్య, రఘుపతిరెడ్డి, హుస్సేన్, లక్ష్మినారాయణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎవరికి వారే తమ అనుచరులతో సంప్రదింపులు జరుపుతూ పదవికోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కొత్త ఉపాధ్యక్షుడి ఎంపికపై యూనియన్ శ్రేణుల్లో చర్చకు తెరలేచింది.
బుచ్చయ్య వైపు చూపు?
గతంలో రెండుసార్లు బ్రాంచ్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన జోగ బుచ్చయ్య మరోసారి పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించిన ఆయనకు ఏరియాలోని కార్మిక వర్గాల్లో పరిచయం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కార్మికులను ఏకం చేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు. గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో యూని యన్ విజయానికి ఆయన పనిచేశారని పేర్కొంటున్నారు. దీంతో ఈసారి కూడా ఆయన పేరు బలంగా వినిపిస్తోంది.
మార్పు ఉంటుందా?
ప్రస్తుతం బ్రాంచ్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న బేతెల్లి మధుకర్‌రెడ్డిని కొనసాగిస్తారా? లేక కొత్త వ్యక్తికి అవకాశం కల్పిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త నాయకత్వానికి అవకా శం ఇవ్వాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు యూనియన్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నా దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడలేదు.
ఎన్నికలే కేంద్రంగా..
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బ్రాంచ్ స్థాయిలో నాయకత్వ ఎంపికకు ప్రాధాన్యం ఏర్పడింది. కార్మికులను సమీకరించడం, యూనియన్ బలోపేతం చేయ డం, సంస్థలోని సమస్యలపై పోరాటాలను ముందుకు తీసుకెళ్లడంలో బ్రాంచ్ నాయకత్వం కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త ఉపాధ్యక్షుడి ఎంపికపై కేంద్ర కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు సింగరేణి కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ముగిసిన రెండేళ్ల పదవీకాలం
ఆశావహులుగా పలువురు నాయకులు
అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ
రానున్న గుర్తింపు సంఘం
ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం


