భూపాలపల్లి పట్టణంలో స్వైరవిహారం | - | Sakshi
Sakshi News home page

భూపాలపల్లి పట్టణంలో స్వైరవిహారం

Sep 21 2026 12:56 AM | Updated on Sep 21 2026 12:56 AM

భూపాలపల్లి పట్టణంలో పందుల బెడద తీవ్రరూపం దాలుస్తోంది. కలెక్టరేట్‌ నుంచి మొదలుకొని నివాస ప్రాంతాల్లోనూ స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ పట్టణ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే ఎప్పుడు అడ్డం వస్తాయో అని కాలనీవాసులు, వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ఐదేళ్ల క్రితం పట్టణంలో పందులను తరలించినా.. ప్రస్తుతం అధికారులు కనీసం చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్‌ అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా పందులను పట్టణం వెలుపలికి తరలించాలని పట్టణవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. – భూపాలపల్లి అర్బన్‌

భూపాలపల్లి పట్టణ శివారు ప్రాంతాలతో పాటు మంజూర్‌నగర్‌, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, కలెక్టరేట్‌ పరిసరాలు తదితర ప్రాంతాల్లో పందుల సంఖ్య గణనీయంగా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. పందుల గుంపులతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు రాకపోకలు సాగించే సమయంలో పందులు ఎదురవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టణంలోని ఖాళీ ప్లాట్లు పందులకు ఆవాసాలుగా మారుతున్నాయి. మంజూర్‌నగర్‌, పట్టణ శివారు, కలెక్టరేట్‌ పరిసరాల్లో ఖాళీ స్థలాల్లో పందులను ఉంచుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆవాసాల చుట్టూ వ్యర్థాలు పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. వర్షాలు కురిసిన సమయంలో వ్యర్థాలు, మురుగునీరు కలవడంతో దుర్వాసన మరింత తీవ్రంగా మారుతోందని కాలనీవాసులు వాపోతున్నారు.

గతంలో తరలింపు..

సుమారు ఐదేళ్ల క్రితం మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపట్టి పట్టణంలోని పందులను ఇతర ప్రాంతాలకు తరలించారు. కొంతకాలం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ గతేడాది నుంచి పందుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం పందుల పెంపకం, సంచారంపై సమగ్ర నియంత్రణ లేకపోవడంతో సమస్య తిరిగి మొదటికి వచ్చినట్లయింది. దీనిపై మున్సిపల్‌ పాలకవర్గం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తే సమస్య పరిష్కారానికి నోచుకుంటుంది. హోటళ్లు, ఫంక్షన్‌హాళ్ల నుంచి వెలువడే ఆహార వ్యర్థాలను క్రమబద్ధంగా సేకరించేలా చర్యలు చేపట్టాల్సిన అసవరం కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement