వైద్య శిబిరాల జాడేది..?
మండలంలో జ్వరాలు విజృంభిస్తున్న క్రమంలో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమై గ్రామాలలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాలలో విపరీతమైన దోమలు ఉన్నాయని.. సంబందిత అధికారులు చొరవ తీసుకుని దోమల మందు రెండు వారాలకు ఒకసారి పిచికారీ చేయించాలని వేడుకుంటున్నారు.
● ఓ వైపు వర్షాలు.. మరోవైపు ఎండలు
● వాతావరణ మార్పులతో ఇబ్బందులు
● ఆస్పత్రికి క్యూ కడుతున్న జ్వరపీడితులు
చిట్యాల: ఓ వైపు వర్షాలు.. మరోవైపు ఎండాకాలాన్నీ తలపిస్తూ సూర్యుడి భగభగలతో ప్రజలు సీజనల్ వ్యాధులకు గురవుతున్నారు. చిట్యాల మండలంలో పలు గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. శుక్రవారం ఒక్కరోజే చిట్యాల సివిల్ ఆస్పత్రికి 125 మంది రోగులు వచ్చి వైద్యం పొందారు. వారం రోజులుగా ఆస్పత్రికి జ్వరపీడితుల రాక పెరుగుతోంది.
వారం నుంచే జ్వరాలు..
వారం రోజుల క్రితం కురిసిన వర్షాలతో ప్రజలు జర్వాల బారిన పడుతున్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో వైరల్ జర్వాలు, దగ్గు , జలుబు వంటి వ్యాధుల బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిట్యాల మండల కేంద్రంతో పాటు మండలంలోని జూకల్, చల్లగరిగ, తిర్మలాపూర్, కై లాపూర్ తదితర గ్రామాలలో ప్రజలు జ్వరాల బారిన పడి సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతీ ఇంట్లో కనీసం ఒకరిద్దరు జ్వరంతో బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఈ మేరకు గ్రామాలలో ఉన్న ఆర్‌ఎంపీ, ప్రైవేట్ వైద్యుల వద్ద చికిత్స పొందుతున్నారు. మరికొందరు పరకాల, వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం పొందుతున్నారు.
సివిల్ ఆస్పత్రిలో రద్దీ..
మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రికి అనేక మంది జర్వాల బారిన పడిన వారు వచ్చి వైద్యం పొందుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే ఓపీ 125 మంది వచ్చి చూపించుకున్నారు. మరికొందరు తీవ్రమైన జ్వరంతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. వైద్యులు జ్వర బాధితులకు అవసరమైన వైద్యం అందించడంతో పాటు మందులు ఇస్తున్రాను.
మండుతున్న ఎండలు..
ఐదు రోజులుగా మండలంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం తీవ్రమైన ఎండతో పాటు ఉక్కపోతకు గురై ప్రజలు అవస్థలు పడుతున్నారు. పొలం పనులకు వెళ్లే ప్రజలు ఎండవేడిమికి తట్టుకోలేక ఇంటివద్దనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎండ పనికి పోయిన కూలీలు తీవ్రమైన ఎండకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు.


