రేగొండ: పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని కాళేశ్వరం సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొడవటంచ ఆలయ ప్రాంగణంలోని ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. ప్లాంటేషన్‌లోని ప్రతీ మొక్కను సంరక్షించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్, డివిజనల్ ఫారెస్ట్ అధికారి అప్పలకొండ, రేంజ్ ఫారెస్ట్ అధికారి చంద్రమౌళి, ఫారెస్ట్ సెక్షన్ అధికారి రాజేంద్రప్రసాద్, ఫారెస్ట్ బీట్ అధికారి గీత, అటవీ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
వేలంలో పాల్గొనాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి భవిష్యత్‌తో పాటు కార్మికులు, ఉద్యోగుల ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇల్లందు–కోయగూడెం, మందమర్రి–శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ల వేలం ప్రక్రియలో సింగరేణి యాజమాన్యం తప్పనిసరిగా పాల్గొనాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బొగ్గు బ్లాక్‌లను పారదర్శక వేలం విధానంలో కేటాయిస్తున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం అవసరమైన ఆర్థిక, సాంకేతిక, పరిపాలనా చర్యలు చేపట్టి పోటీ బిడ్డింగ్‌కు సిద్ధం కావాలని కోరారు. కొత్త బొగ్గు బ్లాక్‌లు సంస్థకు లభిస్తే భవిష్యత్ బొగ్గు ఉత్పత్తి కొనసాగింపుతో పాటు సంస్థ విస్తరణ, ఆదాయ వృద్ధి, ఉద్యోగ భద్రతకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ విషయంపై బీఎంఎస్ నాయకత్వం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని కలిసి సింగరేణి టెండర్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సింగరేణి టెండర్‌లో పాల్గొంటే బ్లాక్‌లు దక్కేలా అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి హామీని కార్యరూపంలోకి తీసుకురావాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వంపైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని యాజమాన్యంతో సమన్వయం చేసి అవసరమైన సహకారం అందించాలని కోరారు. బొగ్గు బ్లాక్‌ల టెండర్‌లో జాప్యం చేయకుండా తక్షణ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.
అటవీశాఖకు
రూ.12 లక్షల ఆదాయం
భూపాలపల్లి: ఇసుక, కలప అక్రమ రవాణా తదితర కేసులలో అటవీశాఖ అధికారులకు పట్టుబడిన వాహనాలకు శుక్రవారం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో టెండరు ప్రక్రియ ద్వారా వేలం నిర్వహించి డ్రా తీశారు. మొత్తం 47 వాహనాలకు వేలం వేయగా శాఖకు రూ.12 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్, ఎఫ్‌డీఓ అప్పలకొండ, ఎఫ్‌ఆర్‌ఓ సృజనకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.
అలసత్వం వహిస్తే
చర్యలు
మొగుళ్లపల్లి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండలంలోని మొట్లపల్లి గ్రామంలో ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. డెంగీ సోకిన రోగి ఇంటిని సందర్శించి వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వైద్యసిబ్బందికి సూచించారు. అనుమానిత వ్యాధిగ్రస్తుల నుంచి రక్త నమూనాలను సేకరించాలన్నారు. వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్న గ్రామాల్లో ముందస్తు వైద్యశిబిరాలు నిర్వహించడంతో పాటు సిబ్బంది ఎప్పటికప్పుడు వ్యాధులపై ప్రజలకు విస్తత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరహరి వెంకట్‌రెడ్డి, మండల వైద్యాధికారి డాక్టర్ జి.నవత, డాక్టర్ యాస్మిని, సీహెచ్‌ఐ రాజేంద్రప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.


