భూపాలపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తవుతున్నా.. 6 గ్యారెంటీలు, 420 హామీలు, మూడు డిక్లరేషన్లలో చాలావరకు అమలు కాలేదని.. హామీలు అడిగితే తమ నాయకులపై పోలీసులతో డాడులు చేయించారని బీఆర్‌ఎస్ నాయకురాలు, వరంగల్ మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి విమర్శించారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం అంబేడ్కర్ సెంటర్ నుంచి జయశంకర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదని, ప్రశ్నించే హక్కును ప్రభుత్వం గౌరవించాలని అన్నారు. రాజకీయ కక్షలకు పాల్పడకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేయాలని సూచించారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజాతీర్పును అవమానిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని గండ్ర జ్యోతి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి
1000 రోజుల పాలనపై
అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం


