ఓపెన్‌కాస్టుకు అడుగులు.. | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌కాస్టుకు అడుగులు..

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

21 ఏళ్లుగా నిరీక్షణ 40 మిలియన్‌ టన్నుల బొగ్గు వెలికితీత

పాలంపేట డెవలప్‌మెంట్‌

కమిటీదే తుది నిర్ణయం

ములుగు: జిల్లాలోని వెంకటాపురం(ఎం) మండల కేంద్రం శివారులో పీవీ.నర్సింహారావు ఓపెన్‌కాస్టు గనిని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్లలో 40 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికితీసేందుకు 2020 నవంబర్‌లో సింగరేణి సంస్థ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భూమి పూజ చేశారు. దీంతో రామప్ప పరిరక్షణ కమిటీతోపాటు ప్రజాసంఘాలు.. ఓపెన్‌కాస్టు గనితో రామప్ప ఆలయానికి ముప్పు వాటిళ్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులతోపాటు సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు సంయుక్తంగా పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రామప్ప ఆలయానికి, ఓపెన్‌ కాస్టు గని ప్రారంభించే ప్రదేశానికి ఎంత దూరం ఉంది.. బ్లాస్టింగ్‌లు చేస్తే రామప్ప ఆలయం వైబ్రేషన్‌కు గురవుతుందా.. అనే అంశాలపై జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) అధికారులు సైతం సర్వే నిర్వహించారు. సర్వే వివరాలు వెల్లడి కాకముందే రామప్ప ఆలయానికి 2021 జూలై 25న యునెస్కో గుర్తింపు రావడంతో తాత్కాలికంగా ఓపెన్‌కాస్టు గని పనులను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో గత 5 ఏళ్లుగా సింగరేణి సంస్థ ఎలాంటి పనులు చేపట్టలేదు. తాజాగా వారం రోజుల నుంచి సింగరేణి సంస్థ అధికారులు ఓపెన్‌కాస్టు గని ప్రాంతాన్ని పరిశీలిస్తూ గనిని ప్రారంభించేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే సింగరేణి సంస్థ.. మైనింగ్‌, జియాలాజికల్‌, ఏఎస్‌ఐ శాఖ, పర్యావరణ అనుమతులు పొందినట్లు ప్రచారం జరుగుతుంది.

వెంకటాపురం(ఎం) శివారులో నాణ్యమైన బొగ్గు ఉందని 2005లో సింగరేణి సంస్థ 9, 9ఏ ఇంకై ్లన్‌ బావులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. బావుల వద్దకు వెళ్లేందుకు ప్రత్యేక రహదారి కోసం రైతుల నుంచి భూమిని సైతం సేకరించారు. కానీ, బావులు ప్రారంభించే సమయంలో నక్సల్స్‌ బెడద ఎక్కువ కావడంతో ఈ నిర్ణయంపై సింగరేణి వెనక్కి తగ్గింది. తిరిగి 2020 నవంబర్‌లో బావుల స్థానంలో ఓపెన్‌కాస్టు గని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ శ్రీకారం చుట్టింది. భూ సేకరణకు ఎంజాయ్‌మెంట్‌ సర్వే సైతం నిర్వహించింది. రైతులకు భూ పరిహారం అందించే ప్రక్రియను ప్రారంభించే సమయంలో 2021 జూలై 25న రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. దీంతో ఓపెన్‌కాస్టు గనిని తాత్కాలికంగా నిలిపివేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పనులను నిలిపివేశారు. ప్రస్తుతం తిరిగి గనిని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ అన్ని శాఖల అనుమతి పొంది గని ద్వారా పాలంపేట డెవలప్‌మెంట్‌ కమిటీ ఇచ్చే ఎన్‌ఓసీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి.

పీవీ.నర్సింహారావు ఓపెన్‌కాస్టు గని ప్రారంభమైతే రాబోయే 20 ఏళ్లలో 40 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికితీయనున్నారు. ప్రతిఏటా 2.5 మిలియన్‌ టన్నుల నుంచి 3 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికితీయాలని సింగరేణి భావిస్తుంది. గని కోసం 2,648 ఎకరాల భూమిని అధికారులు సేకరించనున్నారు. ఇందులో 1,164 ఎకరాల అటవీభూమి, 941 ఎకరాల్లో రైతులకు చెందిన పట్టా భూములు, 429 ఎకరాల్లో అసైన్డ్‌ భూములు, 114 ఎకరాల్లో రెవెన్యూ భూమి ఉంది. భూసేకరణ కోసం రూ.245.51 కోట్లను సింగరేణి సంస్థ ఖర్చు చేయనుంది. గని పనులు ప్రారంభమైతే సీఎస్‌ఆర్‌ నిధులు నుంచి ప్రతిఏటా రూ.2 కోట్లు గ్రామాభివృద్ధికి కేటాయించడమే కాకుండా వెయ్యిమందికి ఉపాధి అవకాశాలు కల్పించసున్నట్లు సింగరేణి అధికారులు అనధికారికంగా వెల్లడిస్తున్నారు.

వెంకటాపురం(ఎం)లో చేపట్టే ఓపెన్‌ కాస్టు గనిపై పాలంపేట డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిటీ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఏరియల్‌ సర్వే ప్రకారం ఓపెన్‌కాస్టు గనికి 5.8 కిలోమీటర్ల దూరంలో రామప్ప ఆలయం ఉందని సింగరేణి అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఓపెన్‌కాస్టు కోసం బ్లాస్టింగ్‌లు చేపట్టినా.. రామప్ప ఆలయానికి నష్టం వాటిల్లదని చెబుతూ సింగరేణి సంస్థ అనుమతులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గని కోసం 30 మీటర్ల నుంచి 300 మీటర్ల లోతు వరకు తవ్వకాల కోసం బ్లాస్టింగ్‌లు చేస్తే కిలోమీటరు వరకే వైబ్రేషన్స్‌ వస్తాయని, ధ్వని మాత్రం ఎక్కువగా వినపడే అవకాశాలు ఉంటాయని సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు. అన్ని శాఖల నుంచి అనుమతులు వచ్చాయని, పాలంపేట డెవలప్మెంట్‌ అథారిటీ కమిటీ నుంచి ఎన్‌ఓసీ లభిస్తే డిసెంబర్‌లోగా పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది.

అన్ని శాఖల నుంచి

అనుమతులు వచ్చినట్లు ప్రచారం

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో

పనులకు త్వరలో శ్రీకారం?

20 ఏళ్ల పాటు 40 మిలియన్‌ టన్నుల బొగ్గు వెలికితీత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement