ఓటరు జాబితా సవరణకు గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితా సవరణకు గడువు పొడిగింపు

Sep 9 2026 3:10 AM | Updated on Sep 9 2026 3:10 AM

భూపాలపల్లి అర్బన్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఐఆర్‌–2026) ప్రక్రియలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువును అక్టోబర్‌ 7వరకు పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాహుల్‌శర్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం నోటీసుల జారీ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలన, పరిష్కార ప్రక్రియ నవంబర్‌ 5వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. గతంలో ఈ గడువు అక్టోబర్‌ 15తో ముగియాల్సి ఉండేదన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీని అక్టోబర్‌ 19నుంచి నవంబర్‌ 9, 2026కు మార్చినట్లు తెలిపారు. 2026 అక్టోబర్‌ 1నాటికి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హత కలిగిన ప్రతీ పౌరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారు కొత్తగా ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఇప్పటికే ఉన్న ఓటర్ల వివరాల్లో మార్పులు, చేర్పులు లేదా సవరణలు అవసరమైతే నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రతీ పౌరుడు ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా సమగ్రంగా, పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

కలెక్టర్‌ను కలిసిన

ఎస్‌ఈ సదానందం

భూపాలపల్లి రూరల్‌: విద్యుత్‌ ఎస్‌ఈగా బాధ్యతలు స్వీకరించిన నాగెల్లి సదానందం మంగళవారం కలెక్టర్‌ రాహుల్‌శర్మను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ.. వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాను మరింతగా అభివృద్ధి చేసే దిశగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

అర్చకులకు ప్రభుత్వ

గుర్తింపు కార్డులు

భూపాలపల్లి అర్బన్‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న ప్రతీ ధూప దీప నైవేద్య అర్చకుడు ప్రభుత్వ గుర్తింపు కార్డు కలిగి ఉండటం తప్పనిసరి అని ధూప దీప నైవేద్య అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్‌ వాసుదేవశర్మ అన్నారు. జిల్లాలోని అర్చకులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లాకేంద్రంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వాసుదేవశర్మ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ధూప దీప నైవేద్య పథకం కింద పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వం ప్రతీ నెల ఒకటో తేదీన వారి బ్యాంకు ఖాతాల్లో గౌరవ వేతనం జమ చేస్తుందన్నారు. ధూప దీప నైవేద్య ఆలయాల అభివృద్ధికి అర్చకులు తమవంతు కృషి చేస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అర్చకులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉండటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరేశ్వర్‌ శర్మ, కోశాధికారి హరికృష్ణ, మాజీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దక్షిణమూర్తి, రాష్ట్ర మహిళా కన్వీనర్‌ విశాలాక్షి, నంది విజయ్‌కుమార్‌, సహాయ కార్యదర్శి శివకుమార్‌ పాల్గొన్నారు.

11న జాబ్‌మేళా

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 11న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్‌మేళాలో ఆదర్శ ఆటోమొబైల్స్‌, భూపాలపల్లి బ్రాంచ్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్టులు 10 ఖాళీలు ఉన్నాయన్నారు. ఏదైనా డిగ్రీతో పాటు 20ఏళ్లు పైబడిన వారు అర్హులన్నారు. నెలకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు వేతనం అందించనున్నట్లు తెలిపారు. గ్రీన్‌హోండా కపిల్‌ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 10 ఉన్నాయని ఇంటర్‌ లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో 20 ఏళ్లు పైబడిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నెలకు రూ.15వేల వేతనం అందించనున్నారు. విద్యార్హతల సర్టిఫికెట్లతో కలెక్టరేట్‌లోని ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళాకు హాజరుకావాలని తెలిపారు. వివరాలకు 95024 68800లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement