విద్యారణ్యపురి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, పలు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) సైన్స్ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో ఎంపిక చేసిన 26 ఉన్నత పాఠశాలల(కేజీబీవీలతో కలిపి)కు రూ.6.76 కోట్లు సమగ్రశిక్ష నుంచి మంజూరు లభించింది. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (సమగ్ర శ్రిక్ష) నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక్కో పాఠశాలకు రూ.26లక్షలు
ఒక్కో పాఠశాలకు రూ.26లక్షల చొప్పున కేటాయించారు. ఈ నిధులతో సైన్స్ ల్యాబొరేటరీ గదుల నిర్మాణం, పరికరాల సేకరణ, సరఫరా, ఇన్‌స్టాలేషన్ టెస్టింగ్ కమిషనింగ్‌కు పరిపాలనా అనుమతి ఇచ్చారు. ల్యాబ్ గది నిర్మాణానికి రూ.25లక్షలు, పరికరాలకు రూ.లక్ష కేటాయించారు. పనులను రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల సంస్థ (టీజీఈడబ్లూ ఐడీసీ – హైదరాబాద్)కి అప్పగించారు. ఇ–ప్రొక్యూర్‌మెంట్ విధానంలో టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు.
జిల్లాల వారీగా పాఠశాలలు,
నిధుల వివరాలు..
హనుమకొండ జిల్లాలో హైస్కూళ్లు, కేజీబీవీలు కలిపి తొమ్మిదింటికి రూ.2.34 కోట్లు మంజూరయ్యాయి. హసన్‌పర్తి, ధర్మసాగర్, ఆత్మకూరు, ఎల్కతుర్తి కేజీబీవీలు, తరాలపల్లి, కడిపికొండ, వంగపహాడ్ జెడ్పీహెచ్‌ఎస్‌లు, శాయంపేట జాగీర్, వడ్డేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
● వరంగల్ జిల్లాలో మూడు పాఠశాలలకు రూ.78లక్షలు మంజూరయ్యాయి. సంగెం కేజీబీవీ, చార్‌బౌలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పైడిపల్లి జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నాయి.
● జనగామ జిల్లాలో నాలుగు పాఠశాలలకు రూ.1.04కోట్లు వచ్చాయి. కొడకండ్ల, నర్మెట, రఘునాథపల్లి కేజీబీవీలు, చెన్నూరు జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నాయి.
● ములుగు జిల్లా మంగపేట జెడ్పీహెచ్‌ఎస్‌కు రూ.26లక్షలు మంజూరయ్యాయి.
● మహబూబాబాద్ జిల్లాలో 9 పాఠశాలలకు రూ.2.34కోట్లు మంజూరయ్యాయి. చిన్నగూడూరు, పెద్దగూడూరు, మరిపెడ, వంగర కేజీబీవీలు, దాట్ల, హరిపిరాల, జమాండ్లపల్లి, ఆలేర్, పెనుగొండ జెడ్పీహెచ్‌ఎస్‌లున్నాయి.
● జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఈ దశలో నిధులు విడుదల కాలేదు
ఈ నిబంధనలు పాటించాల్సిందే..
సైన్స్ లేబొరేటరీలు నిర్మాణం పూర్తయ్యాక వర్క్‌స్టేషన్లు, పరికరాలు టీజీఈడబ్లూ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి సంయుక్తంగా తనిఖీ చేసి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించాలి. ఆ తరువాత వాటిని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు అప్పగించాల్సి ఉంటుంది.
ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలో
సైన్స్ ప్రయోగశాలలు
ఐదు జిల్లాల్లో 26 ఉన్నత పాఠశాలలకు రూ.6.76 కోట్లు మంజూరు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కేటాయించని నిధులు


