భూపాలపల్లి: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న.. ధరలిట్లా మండవట్టె నాగులో నాగన్న అనే ఓ పాత సినిమా పాట ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. నెల రోజులుగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు బెంబేలెత్తుతున్నాయి. కూలీనాలి చేయగా వచ్చిన డబ్బులతో కనీస సరుకులు కొనలేని దుస్థితి నెలకొందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెల రోజులుగా ౖపైపెకి
నిత్యావసర సరుకుల ధరలు నెల రోజుల క్రితం వరకు కొంతమేర అదుపులో ఉండగా ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, కందిపప్పు, వంటనూనెలు, మసాలాలు, కారంపొడి, ఎండు చేపలు, రొయ్యల ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. చక్కెర, బొమ్మిడాయల ధరలు మాత్రం డబుల్ అయింది. పెరుగుతున్న ధరలను చూసి పేదలు ఖంగుతింటున్నారు.
చక్కెర కిలో రూ.45 నుంచి రూ.70కి..
చక్కెర ధర వ్యాపారులు సైతం ఊహించని రీతిలో పెరిగింది. నెల రోజుల క్రితం వరకు కిలో ధర రూ.42 ఉండగా, అనంతరం రూ.43, 45, 48, రూ.50కి చేరుకొని ఇప్పుడు ఏకంగా రూ.70కి చేరువలో ఉంది. నాణ్యమైన మొదటి రకం చక్కెర రూ.73కు లభిస్తోంది. రాఖీ పండుగ సందర్భంగా స్వీట్లు ఎక్కువగా వినియోగిస్తారు. ఈ సమయంలో చక్కెన ధర పెరగడంతో వ్యాపారులు పలు రకాల స్వీట్ల ధరలను కూడా పెంచేశారు.
ఘాటెక్కిన మసాలాలు
వారం రోజుల క్రితం కిలో ఇలాచీల కిలో ధర రూ.4,200 ఉండగా, ఇప్పుడు రూ.5 వేలకు చేరింది. అలాగే, ధనియాల ధర నెల క్రితం కిలోకు రూ.160కి విక్రయించగా, ప్రస్తుతం రూ.220కి అమ్ముతున్నారు. అల్లం మాత్రం కొంత ఉపశమనం కలిగించింది. పది రోజుల క్రితం వరకు కిలో రూ.240కి లభించగా ఇప్పుడు కొత్త అల్లం మార్కెట్‌లోకి రావడంతో రూ.200కే విక్రయిస్తున్నారు.
ఎండు చేపలు కొనలేం..
రాష్ట్రంలో సాధారణంగా కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన సమయంలో ప్రత్యామ్నయంగా ఎండు చేపలు, రొయ్యలను ప్రజలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాల్లో వర్షం కురుస్తుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితి. అంతేకాక పచ్చి వాటిని ఎండబెట్టేందుకు అవకాశం లేదు. దీంతో వాటి ధర డబుల్ అయింది. గతంలో బొమ్మిడాయలు కిలోకు రూ.450 ఉండగా, ఇప్పుడు రూ.900, ఎండు రొయ్యలు రూ.450 కాగా, ప్రస్తుతం రూ.700కు విక్రయిస్తున్నారు. ధర పెరిగినప్పటికీ బొమ్మిడాయలు లభించడం లేదని, నాణ్యత లేనివే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే, మెత్తలు గతంలో రూ.380 నుంచి రూ.400 వరకు ఉండగా, ప్రస్తుతం కిలో రూ.450కి అమ్ముతున్నారు.
పండుగల వేళ ధరల మోత
శుక్రవారం రాఖీ పౌర్ణమి, అక్టోబర్‌లో బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నాయి. ఈ సమయంలోనే నిత్యావసర సరుకులైన ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, మసాలాలు, పప్పు దినుసుల ధరలు విపరీతంగా పెరడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అయితే, ధరలు ఇలాగే కొనసాగితే పండుగల సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు తప్పేలా లేవు.
శ్రావణం ప్రభావంతో..
మసాలాలు, సరుకుల ధరలు తీవ్రంగా పెరుగుతుండగా శ్రావణమాస ప్రభావంతో కోడిగుడ్లు, చికెన్ ధరలు కొంత మేర తగ్గాయి. పక్షం రోజుల క్రితం వరకు ఒక కోడిగుడ్డును రూ.7కు విక్రయించగా, ఇప్పుడు రూ.6 నుంచి రూ.6.50 వరకు లభిస్తోంది. శ్రావణ మాసానికి ముందు చికెన్ ధర కిలో రూ.320 నుంచి రూ.340 వరకు ఉండగా, ఇప్పుడు విత్ స్కిన్ రూ.240, స్కిన్‌లెస్ రూ.260కి అమ్ముతున్నారు.
సరుకులు పాత ధర ప్రస్తుత ధర
(కిలో రూ.లలో)
చక్కెర 45 70
ఉల్లిగడ్డ 35 60
ఎల్లిగడ్డ 120 250
పల్లీలు 145 180
వంటనూనె 170 185
కారంపొడి 300 340
కందిపప్పు 120 160
రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల రేట్లు
చక్కెర, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ పిరం
నశాలానికి అంటుతున్న మసాలాలు
ఎండు రొయ్యలు, బొమ్మిడాలు
కొనలేని పరిస్థితి
శ్రావణం ఎఫెక్ట్‌తో కాస్త తగ్గిన గుడ్లు, చికెన్ వెలలు


