పత్తిమొక్కలతో నిరసన | - | Sakshi
Sakshi News home page

పత్తిమొక్కలతో నిరసన

Aug 23 2026 1:16 AM | Updated on Aug 23 2026 1:16 AM

భూపాలపల్లి రూరల్‌: తమ కళ్లముందే ఫారెస్టు అధికారులు పత్తి పంటను తొలగించి అన్యాయం చేశారని.. తమకు న్యాయం చేయాలని భూపాలపల్లి మండలం దీక్షకుంటకు చెందిన అజ్మీర హరిలాల్‌, రాజు, అమర్‌ సింగ్‌, ప్రేమ్‌, రైతులు శనివారం కలెక్టరేట్‌ ఎదుట పత్తి మొక్కలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వేసవిలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు తమ వద్ద ఎకరాకు రూ.25వేల చొప్పున మొత్తం రూ.5 లక్షల వరకు వసూలు చేసి పంటలు వేసుకోండని అనుమతి ఇచ్చారని ఆరోపించారు. అధికారుల మాట నమ్మి అప్పులు చేసి పత్తి సాగు చేస్తే, ఇప్పుడు అదే అధికారులు వచ్చి పంటను ధ్వంసం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు.

క్రీడాజట్ల ఎంపికలు

భూపాలపల్లి అర్బన్‌: రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ క్రీడా జట్ల ఎంపిక పోటీలు సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి చిర్ర రఘు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అఖిల భారత సివిల్‌ సర్వీసెస్‌ టోర్నమెంట్‌–2026–27లో పాల్గొనే రాష్ట్ర జట్ల ఎంపిక కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అథ్లెటిక్స్‌, క్రికెట్‌, చెస్‌, క్యారమ్స్‌, హాకీ, పవర్‌లిఫ్టింగ్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, వాలీబాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, ఖోఖో, యోగా, లాన్‌ టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఫుట్‌బాల్‌ తదితర క్రీడల్లో పురుషులు, మహిళలకు ఎంపికలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల ప్రభుత్వ ఉద్యోగులు సెప్టెంబర్‌ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల్లోపు జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారినే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 96180 11096 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

దరఖాస్తుల స్వీకరణ

భూపాలపల్లి రూరల్‌: జాతీయ మారకద్రవ్యాల నిరోధక ప్రణాళిక (ఎన్‌ఏపీడీడీఆర్‌) పథకం కింద జిల్లాలో డి–అడిక్షన్‌ (డీడీఏసీఎస్‌) ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థల(ఎన్‌జీఓఎస్‌)నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ సంక్షేమ అధికారి మల్లీశ్వరి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల సంస్థలు ఇ–అనుధాన్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.

ఎస్పీకి వినతి

భూపాలపల్లి అర్బన్‌: నల్లగొండ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ జిల్లాలో పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ ట్రస్మా నాయకులు శనివారం ఎస్పీ సంకీర్త్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి భద్రత కల్పించాలని ఎస్పీని కోరారు. పాఠశాలల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న యాజమాన్య ప్రతినిధులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో విధులు నిర్వహించేలా ప్రభుత్వం ప్రత్యేక సేఫ్టీ మెజర్మెంట్స్‌ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఉడుత సాంబయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, సభ్యులు సతీశ్‌, హరీశ్‌, జోసఫ్‌ పాల్గొన్నారు.

పాలిటెక్నిక్‌ కళాశాల

విద్యార్థుల ఆందోళన

భూపాలపల్లి అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్‌ 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాటారం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు కలెక్టరేట్‌ ఎదుట శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. గతంలో పాలిటెక్నిక్‌ విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో జాయిన్‌ అయ్యే వారని తెలిపారు. ఈ జీఓ ద్వారా మళ్లీ ఇంటర్మీడియట్‌ చదవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సమయం వృథా అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కలెక్టరేట్‌ వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement