90 మంది కండక్టర్లు ‘ఔట్‌’! | - | Sakshi
Sakshi News home page

90 మంది కండక్టర్లు ‘ఔట్‌’!

Aug 23 2026 1:16 AM | Updated on Aug 23 2026 1:16 AM

హన్మకొండ: టీజీఎస్‌ ఆర్టీసీలో జీవితానికి భద్రత ఉంటుందని కోటి ఆశలతో వచ్చిన నిరుద్యోగులను ఏడాదిలోపే సంస్థ రోడ్డున పడేసింది. వరంగల్‌ రీజియన్‌లో ఒక్కసారిగా 90మంది ఔట్‌ సోర్సింగ్‌ కండక్టర్లను తొలగిస్తూ రీజినల్‌ మేనేజర్‌ ఆదేశాల మేరకు పర్సనల్‌ ఆఫీసర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ రీజియన్‌లో మొత్తం 274మంది ఔట్‌ సోర్సింగ్‌ కండక్టర్లు పనిచేస్తుండగా శుక్రవారం రాత్రి 90మందిని తొలగించారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసు, సమాచారం ఇవ్వకుండానే అన్యాయంగా తొలగించారని నిరసన వ్యక్తం చేస్తూ, తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శనివారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయం వద్ద తొలగించిన ఔట్‌ సోర్సింగ్‌ కండక్టర్లు ధర్నా చేశారు. ఏడాది కాలంగా రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను అకారణంగా తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. మరునాడు విధులకు రమ్మని డ్యూటీ చార్టు వేసి రాత్రికి రాత్రే తొలగించడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. తాము ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టర్‌కు రూ.లక్షనుంచి రూ.2 లక్షల వరకు ఇచ్చి విధుల్లో చేరామని ఆరోపించారు. నెలకు ఇచ్చే రూ.18వేలలో ఒక్కరోజు గైరాజర్‌కు రూ.600లకు బదులుగా రూ.1200 కోత విధించినా.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలో ఉద్యోగ భద్రత ఉంటుందని సహిస్తూ వచ్చామన్నారు. తమ కుటుంబాల పరిస్థితులు అర్థం చేసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ షెడ్యూల్స్‌ తగ్గించడంతో కండక్టర్లు మిగులుబాటులో ఉన్నారని, అందుకే తాత్కాలికంగా తొలగించామని తెలిపారు.

వరంగల్‌ రీజియన్‌లో 274మంది

ఔట్‌సోర్సింగ్‌ కండక్టర్లు

ఆర్‌ఎం కార్యాలయం ఎదుట

బాధితుల ధర్నా..

మా కుటుంబాలు

రోడ్డున పడ్డాయని ఆవేదన

తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌

ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించిన ఆర్టీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement