● ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ
లెనిన్ వత్సల్ టొప్పో
కాళేశ్వరం: జిల్లాలో జరుగుతున్న గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ పనులను నాణ్యతతో చేయాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. శనివారం మహదేవపూర్ మండలంలోని గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు, ఇంజనీరింగ్ పనులపై అధికారులు, ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులకు ప్రీ–మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందించే ప్రక్రియను తక్షణమే పూర్తిచేయాలని డీటీడీఓను ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫాం వస్త్రాల సరఫరా, సంబంధిత స్వయం సహాయక బృందాల ద్వారా వస్త్రాలు కుట్టే ఏర్పాట్లపై ఆరా తీసి, కుట్టుపని ప్రారంభించడానికి సంబంధిత అధికారులకు వస్త్రాలను అందజేసేలా చూడాలని పేర్కొన్నారు. విద్యాసంస్థలలో మరమ్మతు పనుల స్థితిపై సమీక్షించి, పనుల కేటాయింపును వేగవంతం చేయడానికి సంబంధిత కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత డీఈఈ, ఏఈఈలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగసాగర్, డీఈఈ హరీశ్, ఏటీడీఓ శివకృష్ణ, ఏఈఈ శ్రీనివాస్, హెచ్‌ఎంలు, వార్డెన్‌లు పాల్గొన్నారు.


