భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీలలో రెండు డెంగీ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని కాకతీయకాలనీ, హన్‌మాన్‌నగర్ కాలనీల్లో రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఎపిడమిక్ టీమ్ సభ్యులు మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి శుక్రవారం ఆయా కాలనీల్లో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. డెంగీ బారిన పడటానికి గల కారణాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, 18వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సందీప్‌రావు, ఏఎంఓ సుధాకర్, సభ్యులు రమేశ్‌బాబు, పరమేష్, గోపి, సతీష్, హెల్త్ అసిస్టెంట్ శ్యాంప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమణరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్–1, కామర్స్–1 పోస్టులకు అతిథి అధ్యాపకులను నియమించేందుకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం) పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. నెట్, సెట్, పీహెచ్‌డీ అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 24న ఉదయం 11 గంటలకు బయోడేటాతో పాటు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, ఒక జత జిరాక్స్ ప్రతులతో కళాశాలకు హాజరై డెమో, ఇంటర్వ్యూలో పాల్గొనాలని ప్రిన్సిపాల్ సూచించారు.
వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు
రేగొండ: వర్షాలు సమృద్ధిగా కురువాలని ఆకాంక్షిస్తూ మండలంలోని తిరుమలగిరి గ్రామస్తులు శుక్రవారం పాండవుల గుట్టల్లో ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై ఉన్న పాండవుల గుహలో బోనం వండి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వరుణ దేవుడు కరుణించాలని పాటలు పాడారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వారు ఈ సందర్భంగా కోరారు.
సర్పంచ్ భర్త
స్మార్ట్‌రేషన్ కార్డుల పంపిణీ
మహాముత్తారం: కొర్లకుంట సర్పంచ్ కోట రజిత భర్త రాంనారాయణగౌడ్ శుక్రవారం అధికారికంగా స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో నిబంధనలు, ప్రోటోకాల్‌ను పాటిస్తూ ఎన్నికై న ప్రజాప్రతినిధులే అధికారికంగా వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై సంబందిత అధికారులు స్పందించి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాటించాల్సిన నిబంధనలు ప్రొటోకాల్‌పై స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.
రామప్పను సందర్శించిన శిక్షణ అధికారులు
వెంకటాపురం(ఎం): మండలంలోని పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న అధికారులు భారత్ దర్శన్‌లో భాగంగా రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్ తీర్థ ప్రసాదాలు అందించారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవాన్ని వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట ఈఓ ఇమ్మడి భాస్కర్, ఎంసీహెచ్‌ఆర్డీ అధికారులు శంకర్, నందకిషోర్, రవి, ఆర్‌ఐ రమేశ్, టూరిస్ట్ పోలీసులు, రెవెన్యూ, పురావస్తు, దేవాదాయ, టూరిజం శాఖల సిబ్బంది ఉన్నారు.


