తనిఖీలు చేపడుతున్నాం..
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. రేషన్‌షాపుల డీలర్లు బియ్యం వ్యాపారులకు సహకరిస్తున్నారు. డీలర్లు కార్డుదారులకు కిలో బియ్యానికి రూ.12–15 వరకు చెల్లిస్తూ.. బియ్యాన్ని అక్రమంగా రూ.18లకు వ్యాపారులకు అమ్ముతున్నారు. సివిల్ సప్లయీస్ అధికారులు మాత్రం దృష్టిసారించడం లేదు. దీంతో డీలర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది.
గతంలో ఏజెంట్ల పద్ధతి..
గతంలో జిల్లావ్యాప్తంగా పీడీఎస్ వ్యాపారులు గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకునేవారు. వారి ద్వారా ఉదయం అంతా బియ్యం సేకరించేవారు. గ్రామాల్లోని వాడల్లో ఇంటింటికీ వెళ్లి పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి గ్రామంలో ఓ ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసేవారు. ఏజెంట్ల ద్వారా సేకరించిన బి య్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళలో తరలించేవారు. బియ్యం వ్యాపారులు వారి పంథా మార్చుకున్నారు. కొత్త పద్ధతిలో వ్యాపారాన్ని నడిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలించకుండా నేరుగా రైస్‌మిల్లులకు తరలిస్తున్నారు. రైస్‌మిల్లులో రీసైక్లింగ్ చేస్తున్నారు.
444క్వింటాళ్ల పట్టివేత
మూడు రోజుల క్రితం రేగొండ మండల కేంద్రంలోని ఓ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 444 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. గణపురం మండలకేంద్రంలోని ఇంట్లో నిల్వ చేసిన 170 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గత నెల 20వ తేదీన టాస్క్‌పోర్స్ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలో ప్రతి రోజు ఏదో ఒక మండలంలో రేషన్ బియ్యాన్ని పట్టుకుంటున్నారు.
అధికారుల కనుసన్నల్లోనే..
జిల్లావ్యాప్తంగా ప్రతీ గ్రామంలో పీడీఎస్ దందా రేషన్‌షాపుల ద్వారానే నడుస్తున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. సివిల్‌సప్లయీస్ అధికారులకు ఈ దందా గురించి తెలిసినప్పటికీ ప్రత్యేక దృష్టిసారించడం లేనట్లు తెలుస్తోంది. 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రేషన్‌షాపుల్లో దాడులు చేసినట్లయితే బియ్యం అక్రమాలు వెలుగు చూసే అవకాశాలు ఉంటాయని జిల్లా ప్రజలు అంటున్నారు. అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నట్లు తెలుస్తోంది.
నగదు బదిలీ సాగుతుందిలా..
జిల్లాలో రేషన్‌షాపుల నుంచి బియ్యానికి బదులుగా డబ్బులు ఇస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. బియ్యం సరఫరాపై పర్యవేక్షణ చేస్తున్నాం. గతంలో జిల్లా వ్యాప్తంగా 8 షాపులను కూడా సీజ్ చేశాం. బియ్యానికి బదులు డబ్బులు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రేషన్‌బియ్యం అక్రమాలపై అడ్డుకట్ట వేస్తున్నాం. బియ్యం అక్రమ రవాణాపై నిఘా ఉంచాం.
– కిరణ్‌కుమార్, డీీసీఎస్‌ఓ
జిల్లావ్యాప్తంగా 277 రేషన్ దుకాణాలు ఉండగా 1.39 రేషన్‌కార్డులు ఉన్నాయి. జిల్లాలో పీడీఎస్ బియ్యానికి బదులుగా నగదు బదిలీ పథకం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. రేషన్‌షాపు డీలర్లు కార్డుదారులను ఇంటికి పిలుచుకొని వేలిముద్రలు వేయించుకుంటున్నారు. వేలిముద్ర వేసినట్లయితే కార్డుదారులు బియ్యం తీసుకున్నట్లే. కొంతమంది రేషన్ డీలర్లు ఒక్కో కేజీకి రూ.12 నుంచి రూ.15ల వరకు వెంటనే చెల్లిస్తున్నారు. మరికొంత మంది డీలర్లు వారి పేర్లు రాసుకొని బియ్యాన్ని తరలించిన రెండు రోజుల తరువాత ఇంటింటికి వెళ్లి డబ్బులు ఇస్తున్నారు.
రేషన్‌షాపుల్లో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని రాత్రి వేళలో తరలిస్తున్నారు. బియ్యం వ్యాపారుల కనుసన్నల్లో రేషన్ డీలర్లు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. బియ్యం వ్యాపారులు ప్రత్యేకమైన డీసీఎం వ్యాన్లు, బొలోరో వాహనాలు ఏర్పాటు చేసుకొని పైలెట్ వాహనాల మధ్య తరలిస్తున్నారు.


