● కలెక్టర్ రాహుల్‌శర్మ
చిట్యాల: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ కోరారు. శుక్రవారం మండలకేంద్రంలోని సివిల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, ప్రసూతి విభాగం, ఐసీయూ, రక్త పరీక్షల ల్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం చికిత్స పొందుతున్న రోగులకు వైద్యసేవలు, మందులు, సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో బాధపడుతూ వైద్యసేవలకు వచ్చే ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కొత్త నియామకాల ద్వారా వైద్యులు, సిబ్బంది అందుబాటులోకి రావడం, మాతా శిశుసంరక్షణ సేవలు, ప్రసవాల సంఖ్య పెరగడం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తంచేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండాలని కోరారు. రోగుల నమూనాలను టీ హబ్‌కు పంపించి పరీక్షల నివేదికలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం వైద్యులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన పరికరాల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డులలో ర్యాక్‌లు, డిస్పోజల్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అల్ట్రాసౌండ్ మిషన్ ప్రోబ్ సమస్యను పరిష్కరించి యంత్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, తహసీల్దార్ వసంతరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సాదాబైనామా, భూభారతి, బల్క్ ల్యాండ్ సర్వే వేగవంతం చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు
భూపాలపల్లి: ఓటర్ల జాబితా సవరణ, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలి పారు. శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురించామని, ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు,బూత్ సూపర్‌వైజర్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, ఎన్నికల సెక్షన్ డీటీ అబ్బాస్, సిబ్బంది పాల్గొన్నారు.


