భూపాలపల్లి అర్బన్: ప్రజాస్వామ్య హక్కులు, రా జ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు పోరాడుతున్న రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ రైతు పోరాట వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఈనెల 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించినున్న ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఉద్యమకారులు, ఆదివాసీలు, రచయితలు, మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కే సులు నమోదు చేసి జైళ్లలో నిర్భందించడం సరికాదన్నారు. జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను, ముఖ్యంగా ఆదివాసీ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు గట్టయ్య, పీక కిరణ్, దాసరి రమేష్, దుబాసి పార్వతి, రాదండి దేవేందర్, అ యిత బాపు తదితరులు పాల్గొన్నారు.


