రేగొండ: మండలకేంద్రంలోని ఓ పాత రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మండలకేంద్రంలోని పాత రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు అధికారులకు సమాచారం రావడంతో మంగళవారం రాత్రి అధికారులు రైస్ మిల్లులో తనిఖీ చేయగా పీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం పౌరసరఫరా శాఖ ఉన్నతాధికారులతో కలిసి మిల్లులో ఉన్న బియ్యం బస్తాలను తనిఖీ చేశారు. ఇందులో సుమారు 444.75 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించారు. పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని మారుతి రైస్ మిల్లుకు తరలించారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు తెలిపారు. రైస్ మిల్లు యాజమాని శ్రీనివాస్, వెహికిల్ డ్రైవర్ సాంబశివుడుపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.


