రేగొండ: భూముల రీసర్వేతో అన్ని రకాల భూముల సమస్యలు పరిష్కారమవుతాయని, రైతులు ఈ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం కొత్తపల్లిగోరి మండలకేంద్రంతో పాటు జగ్గయ్యపేట గ్రామంలో నిర్వహించిన భూముల రీసర్వే గ్రామ సభల్లో ఆర్డీఓ హరికృష్ణతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. భూ హక్కులు లేకపోవడంతో రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకు రుణాలకు దూరం అవుతున్నారన్నారు. కొత్తపల్లిగోరి గ్రామంలో 3,800 ఎకరాలు, జగ్గయ్యపేటలో 2,450 ఎకరాలలో భూ రీసర్వే చేయనున్నట్లు తెలిపారు. మండలంలో సర్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హేమ, ఎంపీఓ సురేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, నాయకులు సంపత్‌రావు ఓంప్రకాశ్, పున్నం రవి, రాజేశ్వరరావు, మటికె సంతోష్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
పకడ్బందీగా ‘సర్’ ప్రక్రియ
రేగొండ: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆర్డీఓ హరికృష్ణ అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తపల్లిగోరి మండలం జగ్గయ్యపేట గ్రామంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 258, 259 పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ విధుల్లో ఉన్న బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లకు ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. తప్పులు లేకుండా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హేమ, ఆర్‌ఐ రాజ్యలక్ష్మి, సూపర్‌వైజర్ పకిడె రాజయ్య, బీఎల్‌ఓలు రజీయా, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
మద్దులపల్లిలో 100 శాతం ఎస్‌ఐఆర్ పూర్తి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం 100 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా బీఎల్‌ఓ మొండయ్యను సర్పంచ్ ఎల్పుల సరిత శాలువాతో గురువారం సన్మానించారు. 165వ పోలింగ్ స్టేషన్ పరిధిలోని 536 మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తిచేసినందుకు ఆయనను అభినందించారు. మండలంలోనే ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తిస్థాయిలో పూర్తిచేసిన గ్రామంగా మద్దులపల్లి నిలిచిందని తెలిపారు.


