తెల్లకాగితమే రశీదుగా.. | - | Sakshi
Sakshi News home page

తెల్లకాగితమే రశీదుగా..

Mar 12 2026 7:39 AM | Updated on Mar 12 2026 7:39 AM

తెల్లకాగితమే రశీదుగా.. ఆధారాలుంటే చర్య తీసుకుంటాం

ఆస్పత్రి ఖర్చులు ఆయన చేతుల్లోనే..

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి పే రూముల్లో గోల్‌మాల్‌

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో జనరల్‌ వార్డులు, ఆస్పత్రి నిర్వహణ కోసం 11 పెయింగ్‌(అద్దె) రూమ్‌లు ఏర్పాటు చేశారు. జనరల్‌ వార్డులో ఉండడం ఇష్టం లేని పేషెంట్లు రోజుకు రూ.500 చెల్లించి ఉంటారు. ప్రతీ రూమ్‌లో ఒకటి పేషెంట్‌కు మరొకటి అటెండెంట్‌కు కలిపి రెండు బెడ్లు ఉంటాయి. అయితే ఈ అద్దె రూమ్‌లకు ఇన్‌చార్జ్‌గా అర్హత లేని శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ ఏళ్ల తరబడి కొనసాగుతుండడమే కాకుండా గది కిరాయి.. అడ్వాన్స్‌ తదితరాలకోసం రశీదులకు బదులుగా తెల్లకాగితాన్ని వినియోగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. వసూలు చేసిన డబ్బులు గోల్‌మాల్‌ జరిగినట్లు ఆస్పత్రిలో బహిరంగ చర్చ జరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

అతనే ఎందుకు..?

గతంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిగా ఉన్న సమయంలో ఆస్పత్రిలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో శానిటేషన్‌ సూపర్‌వైజర్‌కు అద్దె గదుల బాధ్యత అప్పగించారు. దీంతో నాటి నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. మెడికల్‌ కళాశాల ఏర్పడి ప్రభు త్వ జనరల్‌ ఆస్పత్రిగా మార్పు చెంది మూడేళ్లు గడిచింది. కావాల్సిన సిబ్బంది నియామకం కూడా జరిగింది. ప్రస్తుతం ఆస్పత్రికి పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నారు. అయినప్పటికీ ఇంకా శానిటేషన్‌ సూపర్‌వైజర్‌తోనే అద్దె గదుల నిర్వహణ కొనసాగిస్తుండడంపై రోగులతోపాటు వారి కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రశీదులు లేకుండానే..

అద్దె గది తీసుకున్న పేషెంట్లకు రశీదులు ఇవ్వకుండా శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. రశీదులకు బదులుగా తెల్లకాగితంపై అడ్వాన్‌ తీసుకున్నట్లు రాసిస్తున్నాడు. డిశ్చార్జి అయి వెళ్తున్న క్రమంలో మిగితా డబ్బులను తీసుకుంటారు. కానీ, రశీదులు అడిగిన కూడా ఇవ్వడం లేదని పలువురు పేషెంట్లు ఆరోపిస్తున్నారు. అద్దె గదులు 11 ఉండగా ఒకటి ప్రత్యేకంగా శానిటేషన్‌ సూపర్‌వైజర్‌, మరొకటి డ్యూటీలో ఉండే నర్సింగ్‌ సిబ్బంది వినియోగించుకుంటున్నారు. మిగతా తొమ్మిది రూమ్‌లకు ప్రతీ రోజు రూ.4,500 చొప్పు న ఆదాయం వస్తుంది. అడ్మిట్‌ అయిన పేషెంట్ల వద్ద ఇద్దరు నర్సింగ్‌ ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. వారికి సైతం సంబంధం లేకుండానే పేషెంట్ల సంబంధికుల నుంచి అడ్వాన్స్‌ రూపకంగా శాని టేషన్‌ సూపర్‌వైజర్‌ డబ్బులు తీసుకుంటున్నాడు.

కలెక్టర్‌ దృష్టిసారిస్తే..

ఆస్పత్రిలో పేదల నుంచి వసూలు చేసిన డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేయడం, సొంతానికి వినియోగించడంపై కలెక్టర్‌ దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఏళ్ల తరబడి జమ అవుతున్న డబ్బులు, ఖర్చులపై కలెక్టర్‌ అడిట్‌ చేయిస్తే అవకతవకలు బయటపడనున్నాయి.

అద్దె గదుల డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు సరికాదు. వసూలు చేసిన డబ్బులను ఆస్పత్రి అవసరాలకు వాడుకుంటున్నాం. ఏమైనా ఆరోపణలు ఉంటే సాక్ష్యాధారాలతో చూపిస్తే చర్యలు తీసుకుంటాం. అద్దె గదులను ఆస్పత్రి కార్యాలయ సిబ్బందితోనే నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు ఎటువంటి అక్రమాలు జరగలేదు.

– డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌,

ఆస్పత్రి సూపరింటెండెంట్‌

ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న శానిటేషన్‌ సూపర్‌వైజర్‌

బిల్లులు, ఖర్చుల లెక్కలు చూపని వైనం

ఆస్పత్రి సిబ్బంది ఉన్నా ఇతరులకు బాధ్యతలు

కానరాని రశీదు బుక్‌

అద్దె గదుల నుంచి వసూలైన డబ్బులను ఆస్పత్రి అత్యవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ డబ్బులు వసూలు చేస్తున్న శానిటేషన్‌ సూపర్‌వైజర్‌తోనే ఆస్పత్రి ఖర్చులు పెట్టిస్తుండడం గమనార్హం. వసూలు చేసిన డబ్బులను ఎవరి ఇష్టానుసారంగా కాకుండా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కమిటీ సమీక్షంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ, సూపర్‌వైజర్‌ చేస్తున్న ఖర్చులకు సరైన బిల్లులు, పత్రాలు ఉండడం లేదని సమాచారం. చేసిన ఖర్చులకు అధిక ధరలు వేసి నకిలీ బిల్లులు ఆఫీసులో అప్పగించి సొమ్ము చేసుకుంటునట్లు తెలిసింది. అద్దె గదుల ద్వారా వచ్చిన డబ్బుల జమ, ఖర్చుల లెక్కలు లేవనే ప్రచారం జరుగుతోంది. గతంలో కార్యాలయ సిబ్బంది లేకపోవడంతో ఓ వైద్యురాలి అండతో ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు సమాచారం. ఇటీవల ఈ సూపర్‌వైజర్‌ను కార్యాలయ సూపరింటెండెంట్‌ ప్రశ్నించగా సరైన లెక్కలు చూపించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కానీ, అతని పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటనే సందేహం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement