భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో మున్సిపాలిటీ అధికారులు బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో రెస్టారెంట్లలో కిచెన్ షెడ్లను పరిశీలించారు. పాడైన చికెన్, కలుషితమైన ఆహార పదార్థాలు కనిపించడంతో భూమిలో పూడ్చిపెట్టారు. రెస్టారెంట్, హోటళ్ల నిర్వాహకులు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని కమిషనర్ హెచ్చరించారు. రానున్న రోజుల్లో నిరంతరం తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: దివ్యాంగులను వివాహం చేసుకున్న వారికి ప్రోత్సాహకంగా తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షలు అందించనుంది. ఈమొత్తాన్ని పొందేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. నేటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు www. epass. telangana. gov. inద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చేసుకుని పత్రాలను, సంబంధిత సమగ్ర శిశు, అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందించాలని కోరారు.
ఆత్మవిశ్వాసంతో
పరీక్షలు రాయాలి
రేగొండ : పరీక్షల సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్‌సీఓ రాజుకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ఎంజేపీ బాలికల పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో పదో తరగతి కీలకదశ అని అన్నారు. సమయాన్ని వినియోగించుకుని ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ, ఉపాధ్యాయురాలు, తదితరులు పాల్గొన్నారు.
విజయ్‌బాబు మృతి
తీరని లోటు
భూపాలపల్లి: పోలీసుశాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన విజయ్‌బాబు అకాల మరణం తీరని లోటని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గడ్డం విజయ్‌బాబు బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి చేరుకొని ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయంగా రూ.30 వేలు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. 1990లో పోలీసుశాఖలో విధుల్లో చేరిన విజయ్‌బాబు అకాల మరణం తమను కలచివేసిందన్నారు. వారి కుటుంబానికి పోలీసుశాఖ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడికి
గౌరవ డాక్టరేట్
వాజేడు: మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు పీర్ల కృష్ణబాబు గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. అమ్మ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఆయన సేవలను గుర్తించిన ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను బుధవారం ప్రదానం చేసింది.


