
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
గణపురం: ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు భోజనం అందించడం, హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు. గణపురం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ హాస్టల్, బీసీ వసతి గృహాన్ని ఆయన ఆదివారం తనిఖీ చేశారు. మోడల్ స్కూల్ వసతి గృహంలో మధ్యాహ్నం 12.30 గంటలు దాటినా పిల్లలకు భోజనం ఎందుకు పెట్టడం లేదని వార్డెన్‌ను అడగగా ఆదివారం కావున తమకు కూరగాయలు సప్లయ్ చేసే కాంట్రాక్టర్ చికెన్ అందించడంలో ఆలస్యం జరిగిందని అందుకే వంట ఆలస్యం అవుతుందని సమాధానమిచ్చారు. దీంతో సదరు కాంట్రాక్టర్ మరోసారి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మెనూ ప్రకారం టిఫిన్, భోజనం అందిస్తున్నారా.. లేదా.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సక్రమంగానే అందుతున్నాయని విద్యార్థులు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, తమ హాస్టల్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, హాస్టల్ లోపల కారిడార్‌లో సీసీతో లెవలింగ్ చేయించాలని, హాస్టల్ ప్రాంగణంలో పిచ్చి మొక్కలు పెరిగి గుంతల్లో నీరు నిల్వనిలిచ దోమల బెడద ఎక్కవైందని విద్యార్థులు.. ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మోడల్ స్కూల్ హాస్టల్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, హాస్టల్ ప్రాంగణంలో గుంతలు లేకుండా సింగరేణి నుంచి మట్టిని తెప్పించి పూడ్చివేయాలని, హాస్టల్ లోపల సీసీతో మరమ్మతు పనులు చేయాలని సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. భోజనంలో నాణ్యత లేదని భగార అన్నంలో క్యారేట్, పూదిన, కొత్తిమీర లాంటివి లేవని చికెన్ కూర విద్యార్థులకు సరిపోవడం లేదని, సాంబర్‌లో ఎలాంటి కూరగాయలు వేయలేదని ఇలా ఉంటే పిల్లలకు ఎలా పౌష్టికాహారం అందుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రతిరోజు కూడా రుచికరమైన ఆహారం అందించడంలేదని, కుళ్లిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నారని విద్యార్థులు ఎమ్మెల్యే చెప్పారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే పద్ధతి మార్చుకొని మెనూ ప్రకారం విద్యార్థులకు శుభ్రమైన, రుచికరమైన ఆహారం అందించాని తెలిపారు.
మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలకు శంకుస్థాపన
గణపురం మండలంలోని బుద్ధారం గ్రామంలో జెన్‌కో సీఎస్‌ఆర్ నిధులు రూ.80 లక్షలతో నిర్మించనున్న మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలకు ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు