
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● ఎంజీఎంలో ఆకస్మిక తనిఖీ
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద వైద్యులను అదేశించారు. మంగళవారం కలెక్టర్ ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆస్పత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం డాక్టర్లు, అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎంజీఎంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రోగుల సౌకర్యార్థం ఆస్పత్రిలో వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి అన్ని విభాగాలు, వార్డుల వద్ద ప్రదర్శించాలని సూచించారు. అప్పటి వరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీనంబర్ 1800 425 3424ను సంప్రదించి వైద్యం, చికిత్సకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. డాక్టర్లు, సిబ్బంది అందరూ ఎఫ్‌ఆర్‌సీ ద్వారానే హాజరు వేయాలన్నారు. ఆస్పత్రిలో అన్ని విభాగాల వద్ద ఏర్పాటు చేసిన 20 ఫిర్యాదుల పెట్టెలను డాక్టర్ల సమక్షంలో తెరిచి సమస్యలు లేకుండా చూడాలని, డబ్బులు అడిగిన సెక్యూరిటీ గార్డులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ఆస్పత్రి వర్క్‌షాప్ ప్రాంతంలో ప్రైవేట్ దుకాణాల వెండింగ్ జోన్ పనులను కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో ఎంజీఎం పర్యవేక్షకులు డాక్టర్ కిశోర్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్ రామ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ మురళి, ఆర్‌ఎంఓలు అశ్విన్‌కుమార్, శశికుమార్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.
రోగి సహాయ సేవలు ప్రారంభం
ఎంజీఎంలో హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోగి సహాయ సేవలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సహా య సేవల కోసం శిక్షణ పొందిన ఏడుగురు కమ్యూనిటీ హెల్త్‌వర్కర్లను నియమించామని ఆమె తెలి పారు. శస్త్రచికిత్స, ఈసీజీ, ఎంఓటీ, ఎక్స్‌రే, యూఎ స్జీ స్కాన్లు, సీటి స్కాన్ వంటి వివిధ విభాగాలకు రెఫరల్స్, ట్రాన్స్‌ఫర్లు, డిశ్చార్జ్ అయిన రోగులు హాస్పిటల్ పరిధి నుంచి బయటికి వెళ్లే వరకు అవసరమైన సాయం చేస్తారని వివరించారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధి ముజ్తబా హసన్ ఆస్కారి మాట్లాడుతూ సేవలతో రోగులకు త్వరితగతిన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.