
ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
వినాయక చవితి శుభాకాంక్షలు..
భూపాలపల్లి: రాబోవు కొన్ని రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాలు కొనసాగుతున్న సమయంలో నిర్లక్ష్యం చూపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తక్కువ ప్రదేశాలు, వంతెనలు, వాగులు, చెరువులు వంటి నీట మునిగే ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. విద్యుత్ తీగలు, కరెంట్ స్తంభాల దగ్గరికి వెళ్లరాదని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దన్నారు. మండల, గ్రామస్థాయి అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజల నుంచి వచ్చే సమాచారంపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం తహసీల్దార్లు, ఎమర్జెన్సీ టీంలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు.
వినాయక చవితిని పురస్కరించుకొని కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో జిల్లాలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి పండుగను శాంతి, సమన్వయ వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ప్రతిష్ఠించిన విగ్రహాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, జిల్లా యంత్రాంగం పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. నిమజ్జనం వరకు అంతరాయం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. నిర్దేశించిన ప్రాంతాల్లోనే నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా భక్తులకు సూచించారు. ప్రజలందరూ అధికార యంత్రాంగం సలహాలు, సూచనలు పాటించాలన్నారు. వర్షం వల్ల విద్యుత్ ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ