
కేఎంసీ ప్రిన్సిపాల్ చాంబర్ ముట్టడి
ఎంజీఎం: కాకతీయ వైద్య కళాశాల మెన్స్, ఉమెన్స్ హాస్టల్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని 15 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎదుట కూర్చొని నినాదాలు చేశారు. ఈసందర్భంగా సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ మాట్లాడుతూ.. కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే వేతనాలు బకాయిగా ఉన్నాయని, అధికారులు చేసిన తప్పులకు కార్మికులు బలవుతున్నారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ – హెల్త్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లపెల్లి సుధాకర్, కార్మికులు పాల్గొన్నారు.