
మట్టి గణపతులను పూజించాలి
భూపాలపల్లి: మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్‌లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్న మట్టి గణపతులు, మట్టి పతులు పూజించాలన్న వాల్‌పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయానికి వివిధ పనులపై వచ్చిన ప్రజలకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీఆర్‌డీఓ బాలకృష్ణ, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ సుభాష్ నాయక్ పాల్గొన్నారు.
భద్రతా చర్యలు చేపట్టాలి..
వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నవరాత్రుల అనంతరం నిమజ్జనాల వరకు అంతరాయం కలగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిమజ్జనం రోజున అత్యవసర వైద్య కేంద్రాల ఏర్పాటుతో పాటు మహదేవపూర్, జిల్లా ప్రధాన ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నా రు. నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్, క్రేన్లు, తాగునీరు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ పాల్గొన్నారు.
హాస్టళ్లలో పటిష్ట పర్యవేక్షణ..
వసతి గృహాల విద్యార్థుల సంక్షేమం, ఆహార నాణ్యత పరిశీలనకు ప్రత్యేక, పోలీస్, క్లస్టర్ అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో మెనూ పాయించకపోయినా, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలకు సిఫారసు చేయాలని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్ పాల్గొన్నారు.
దరఖాస్తులను పరిష్కరించాలి..
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 53 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
నిరంతర కృషితోనే జిల్లాకు గౌరవం..
కేటాయించిన లక్ష్య సాధనకు కృషి చేయడం ద్వారానే మన జిల్లాకు గౌరవం లభించిందని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వెనుకబడిన జిల్లాల ప్రగతికి నీతి ఆయోగ్ ప్రకటించిన యాస్పిరేషన్ బ్లాక్ సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో సిల్వర్, బ్రాన్జ్ మెడల్స్ సాధించిన సందర్భంగా అధికారులు, సిబ్బందికి అవార్డుల ప్రదానం కార్యక్రమం నిర్వహించారు.
ముఖ గుర్తింపు ద్వారా పింఛన్
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని పింఛన్‌దారులు ఇకపై బయోమెట్రిక్ ఆధారిత ఇబ్బందులు లేకుండా, తాము ఎక్కడ ఉన్నా సులభంగా ముఖ గుర్తింపు ద్వారా పింఛను పొందే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో పోస్టుమాస్టర్లకు పింఛను ఇవ్వడానికి అవసరమైన 89 ముఖ గుర్తింపు పరికరాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఆర్‌డీఓ బాలకృష్ణ, ఆర్డీఓ రవి పాల్గొన్నారు.
సంక్షేమ హాస్టళ్లను
నిరంతరం పర్యవేక్షించాలి
కలెక్టర్ రాహుల్ శర్మ

మట్టి గణపతులను పూజించాలి