
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
భూపాలపల్లి అర్బన్: మూడు రోజుల క్రితం విషతుల్యమైన నీళ్లను తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నా రు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో మూడు రోజుల క్రితం విద్యార్థులు తాగే నీటిలో విషద్రావణాన్ని కలిపినట్టు విద్యార్థుల ద్వారా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇలాంటి ఘటనలు బాధాకరమని, ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో బాధ్యతగా ఉంటూ, వాతావరణ పరిస్థితులలో మార్పులకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలన్నారు. యూఆర్‌ఎస్‌లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విద్యార్థులను పరామర్శించిన అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆస్పత్రి ఆవరణ శుభ్రంగా లేదని డ్యూటీ డాక్టర్లు, సూపరింటెండెంట్ అందుబాటులో లేరని, విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని ప్రైవేట్ ల్యాబ్‌కు వెళ్లి టెస్టులు చేయించుకోవాలని విద్యార్థులను పంపించడం సరికాదన్నారు. తక్షణమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల ల్యాబ్ సౌకర్యాలను మెరుగుపరచాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అనంతరం డీఈఓ ముద్దమల్ల రాజేందర్‌తో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ఆరోగ్యం మెరుగయ్యే వరకు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుభాకర్‌రెడ్డి, కిరణ్‌కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి, స్థానిక నాయకులు కృష్ణమోహన్, హరిప్రసాద్, స్వామి, రాజిరెడ్డి, రమేష్, రవీందర్, జలంధర్ అనిల్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి