
ఏటా ముంపే..
గోదావరి, ప్రాణహిత బ్యాక్‌వాటర్‌తో సమస్య
కాళేశ్వరం: గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగడంతో బ్యాక్‌వాటర్‌తో ప్రతి ఏటా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని పంటలు నీటమునిగి రైతులకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. అన్నారం నుంచి మేడిగడ్డ వరకు పంటలు మొక్క, పూత, కాత దశలోనే నీట మునుగుతున్నాయి. వ్యవసాయ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రతి సంవత్సరం పంట నష్ట సర్వేలు చేయడమే తప్పా పరిహారం అందిన దాఖలాలు లేవు.
గేట్లు ఎత్తితే..
మహదేవపూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వరద వచ్చినప్పుడు గేట్లు ఎత్తితే బ్యాక్ వాటర్‌తో పంట భూములు మునిగి ముంపునకు గురవుతున్నాయి. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలో 20వ పిల్లర్ కుంగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మేడిగడ్డ, సీపేజీ లీకేజీలతో అన్నారం బ్యారేజీల్లో నీటినిల్వలు చేయడం లేదు. గేట్లు కూడా ఎత్తి ఉంచుతున్నారు. వారం రోజు లుగా కురిసిన వర్షాలతో మండలంలోని అన్నారం టు మేడిగడ్డ బ్యారేజీ వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లోని పత్తి పంటలు నీటమునిగాయి. మొక్క, పూత దశలో ఉండి చేతికందే సమయంలో వరదలతో మునిగి నల్లగా మారి మురిగింది. వరద తీసినప్పటికీ ఒండ్రు మట్టి చేరి పంటకు యోగ్యంగా లేదు. సుమారు వందల ఎకరాల్లో పంట నష్టం జరిగినా అధికారులు మాత్రం తక్కువ సంఖ్యలో ప్రాథమికంగా సర్వే రిపోర్టులు పంపిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరానికి రూ.30వేల వరకు రైతులకు నష్టం జరిగింది.
వరద ప్రభావం
గోదావరి, ప్రాణహిత నదుల వరదలతో జిల్లాలోని కాటారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లో పంట నష్టం జరుగుతుంది. గోదావరి తీర ప్రాంతం కాటారం మండలంలో 100 ఎకరాలు, మహదేవపూర్ మండలంలో 200, పలిమెల మండలంలో 100 ఎకరాల వరకు పంటలు నీటమునిగాయి.
మహదేవపూర్‌లో నీటమునిగిన పత్తిపంట
అన్నారం టు మేడిగడ్డ వరకు
పంట నష్టం
మొక్క, పూత, కాత దశలోనే
నీటమునుగుడు..
సర్వేలు తప్ప అందని పరిహారం

ఏటా ముంపే..