
నేడు క్రీడా దినోత్సవ రన్
భూపాలపల్లి అర్బన్: జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని నేడు (శనివారం) జిల్లా కేంద్రంలో రన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు, అన్ని క్రీడాసంఘాల ప్రతినిధులు, సభ్యులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాళేశ్వరం: గత నెల 25న ప్రారంభమైన శ్రావణమాసం నేటితో ముగియనుంది. నెల రోజుల పాటు కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరాలయంలో ప్రత్యేక పూజలను భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయానికి వివిధ పూజలు, లడ్డు, ప్రసాదాలు, గదుల అద్దెలతో ఆదాయం సమకూరింది. గతేడాది శ్రావణమాసంలో రూ.52లక్షల వరకు ఆదాయం రాగా, ప్రస్తుతం 38.60లక్షల ఆదాయం మాత్రమే సమకూరినట్లు తెలిసింది. దీంతో ఈ శ్రావణమాసం ఆలయానికి భక్తుల సంఖ్య తగ్గడంతో ఆదాయం కూడా తగ్గినట్లు ఆలయ వర్గాలు తెలిపారు.
భూపాలపల్లి అర్బన్: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నూతన కార్యదర్శిగా అజ్మీర జైపాల్‌ను నియమించినట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ కలిసి సమష్టిగా జైపాల్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారన్నారు. నూతన కమిటీని నియమించి ఎస్జీఎఫ్‌ఏ క్రీడల క్యాలెండర్‌ను విడుదల చేసినట్లు డీఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ లక్ష్మణ్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భూపాలపల్లి అర్బన్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలపొందిన ఏఐటీయూసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు జనార్దన్, ప్రసాద్‌రెడ్డి, శ్రీనివాసు, బాబు, జయశంకర్, నరసింహారెడ్డి, సాజిద్, సలీం, తదితరులు పాల్గొన్నారు.

నేడు క్రీడా దినోత్సవ రన్