
డ్రంకెన్ డ్రైవ్.. అతివేగం
ఏటా పెరుగుడే..
జిల్లాలో
పెరుగుతున్న రోడ్డు
ప్రమాదాలు
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
భూపాలపల్లి:
● మొహర్రం పండుగకు సరుకులు తీసుకువచ్చేందుకు వెళ్తుండగా డీసీఎం వ్యాన్, బైక్ ఢీకొన్న ఘటనలో జూన్ 25న చిట్యాల మండలంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు.
● ఓ యువరైతు తన పొలం పనులు ముగించుకొని ఆదివారం తెల్లవారుజామున భూపాలపల్లికి వస్తున్న క్రమంలో బొగ్గులవాగు వద్ద కారు అదుపు తప్పి తన బైక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
జిల్లాలో ఇలా నెలకు పది ప్రమాదాలు జరిగి 15 మంది వరకు మృత్యువాత, అంతకు మించి గాయాల పాలవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఎన్‌హెచ్‌పై నిత్యం ప్రమాదాలే..
రేగొండ మండలం చెన్నాపూర్ గ్రామ సరిహద్దు నుంచి కాటారం మండలం నస్తూర్‌పల్లి వరకు జిల్లాలో ఎన్‌హెచ్ 353సీ జాతీయ రహదారి ఉంది. ఈ రహదారి అక్కడక్కడ మాత్రమే మరమ్మతుకు నోచుకుంది. అయినప్పటికీ ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో జరిగిన ప్రమాదాలపై పలువురు పోలీసు అధికారులు పరిశీలన చేయగా.. అందులో నూటికి 90 శాతం ప్రమాదాలు డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ వలనే చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఎనిమిదేళ్ల క్రితం ఇలాగే నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంతో అప్పటి ఎస్పీ భాస్కరన్ జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు వేయించారు. ఎన్‌హెచ్‌పై స్పీడ్ బ్రేకర్లు ఉండకూడదనే నిబంధనలు ఉండటంతో కొద్ది రోజులకే వాటిని తొలగించారు. దీంతో బైక్, కార్లు, లారీలు పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నాయి. ఇందుకు తోడు రాత్రివేళల్లో కొందరు మద్యం సేవించి వాహనం నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
బ్లాక్ స్పాట్స్ ఏర్పాటు చేసినా..
జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్‌లుగా ఎన్‌హెచ్ అధికారులు గుర్తించారు. రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి, గణపురం మండలం గాంధీనగర్, మోరంచపల్లి, భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా సమీపం, కమలాపూర్ క్రాస్‌రోడ్, కాటారం మండలం మేడిపల్లి, నస్తూర్‌పల్లి, మహదేవపూర్ మండలం కుదురుపల్లి తదితర ప్రాంతాల వద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో అక్కడక్కడ బ్లాక్ స్పాట్ బోర్డులను ఏర్పాటు చేసినప్పటికీ రేడియం స్టిక్కర్లు, ప్రమాద హెచ్చరిక బోర్డులు పెద్దగా కనిపించేలా ఏమీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ ప్రాంతాల మీదుగా వెళ్లాలంటే వాహనదారులు జంకాల్సి వస్తుంది.
ఎన్‌హెచ్‌పై నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదం
వందల మంది మృత్యువాత, గాయాలపాలు
బ్లాక్ స్పాట్స్ ఏర్పాటు చేసినా ఫలితం సున్నా..
పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతీ ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2023లో 196 ప్రమాదాలు జరుగగా, 2024లో 223, ఈ ఏడాది ఆగస్టు 15వరకే 134 ప్రమాదాలు జరిగాయి. ఆయా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలు నేటికీ రోదిస్తూనే ఉన్నాయి.
వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు. అతివేగం, డ్రంకెన్ డ్రైవ్, తొందరపాటుతనం మూలంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రివేళ, వర్షం కురిసే సమయాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడవు. అందుకని అప్రమత్తంగా వాహనం నడపాలి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం హైవేపై నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేస్తున్నాం. హైవేపై ప్రమాద స్థలాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించాం.
– సంపత్‌రావు, భూపాలపల్లి డీఎస్పీ

డ్రంకెన్ డ్రైవ్.. అతివేగం

డ్రంకెన్ డ్రైవ్.. అతివేగం