
యూరియా ఇతర అవసరాలకు వాడొద్దు
భూపాలపల్లి: రైతుల కోసం సరఫరా చేసే యూరియాను ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు, కార్యదర్శి రఘునందన్‌రావులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయాధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి పలు సూచనలు చేసిన అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ రాహుల్ శర్మ సమావేశమై మాట్లాడారు. మండలాల వారిగా స్టాకు వివరాలపై ప్రతిరోజు తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సహకార సంఘం, మార్క్‌ఫెడ్, ప్రైవేట్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. వీసీలో ఎస్పీ కిరణ్ ఖరే, అధికారులు పాల్గొన్నారు.
పాపన్నగౌడ్ పోరాటం స్ఫూర్తిదాయకం..
సామాజిక న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాపన్నగౌడ్ చిత్ర పటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, అధికారులు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
దరఖాస్తులను పరిష్కరించాలి..
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 31 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ రవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ