
కుంగిన ప్రసాదశాల పునాది
కాళేశ్వరం: దేవాదాయశాఖ అధికారుల పర్యవేక్షణ లేమి.. కాంట్రాక్టర్లకు వరంగా మారింది. ఆగమేఘాలపై చేసిన పనులకు ప్రసాదశాల భవన నిర్మాణం సాక్షంగా కనిపిస్తుంది. రూ.50లక్షల వ్యయంతో సరస్వతీనది పుష్కరాల సమయంలో నిర్మాణం చేసిన ప్రసాదశాల భవనం పునాది గోడ కిందికి కుంగింది. భూమి నుంచి పునాదిలో సిమెంట్ ఇటుకలతో నిర్మాణం చేసి కింద మట్టిపోయడంతో వర్షానికి కుంగింది. బీటలు వారి పిల్లర్ బీమ్ పొడవునా కింది వైపున క్రాక్ ఇచ్చింది. బీమ్‌పైన కట్టిన ఇటుకల గోడ అక్కడక్కడ వంగిపోయి, క్రాక్ వచ్చి కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ విభాగం ఏమి చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతస్థాయి దేవాదాయశాఖ అధికారులు మౌనం పాటించడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై ఈఓ మహేష్‌ను సంప్రదించగా తాత్కాలికంగా పుష్కరాల సమయంలో చేసిందని, మళ్లీ మట్టి ఇటుకలతో పునాది నిర్మాణం చేస్తామని తెలిపారు. పిల్లర్లకు హాని జరుగలేదని తెలిపారు.