
అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ
● మోరంచపల్లి వాగు ఉధృతి పరిశీలన
భూపాలపల్లి రూరల్: ఆదివారం వరకు వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీచేసిన నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం మోరంచపల్లి వాగు ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాగు ఉధృతి దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. వరద పరిస్థితిని ముందుగా అంచనా వేసి ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలు దృష్ట్యా ప్రజల, పశువుల ప్రాణరక్షణలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. 24 గంటలు కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం నంబర్ 90306 32608 పనిచేస్తుందన్నారు. కలెక్టర్ వెంట ఈఈ ప్రసాద్, డీఈ వరుణ్, ఏఈ షర్ఫ్‌ఉద్దీన్ ఉన్నారు.