
నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం
కాటారం: గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా దుద్దిళ్ల కుటుంబం ముందుకెళ్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. పుష్పగిరి కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఇటీవల మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆపరేషన్ చేయించుకున్న వారికి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో శ్రీనుబాబు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు చేరవేయడం, కంటి వెలుగులు కోల్పోయే పరిస్థితులను నివారించడం కోసం కంటి వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి శస్త్ర చికిత్సలు చేయించి అద్దాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు కంటి సంరక్షణ చర్యలు పాటించి సంతోషంగా ఉండాలని సూచించారు. పుష్పగిరి కంటి ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య, మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండ్రు రమేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చినాల బ్రహ్మారెడ్డి, జాడి మహేశ్వరి, తెప్పెల దేవేందర్‌రెడ్డి, కుంభం రమేశ్‌రెడ్డి, కొట్టె శ్రీహరి, గద్దె సమ్మిరెడ్డి పాల్గొన్నారు.